NTV Telugu Site icon

Presidential Poll: ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ మంతనాలు

Sonia

Sonia

కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దీనిపైనే జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలో జరగబోయే భారత రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. యూపీఏ తరఫున ఎన్సీపీ అధినేత‌, కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్‌తో పాటు కేంద్ర మంత్రిగా, లోక్ స‌భ స్పీక‌ర్‌గానూ రాణించిన కాంగ్రెస్ పార్టీ మ‌హిళా నేత మీరా కుమార్‌లు రేసులో ఉన్నట్లు స‌మాచారం. అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రతిపక్షపార్టీల నేతలతో సంప్రదింపులు చేపట్టారు. డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఎన్‌సీపీ సుప్రీం నేత శరద్ పవార్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో ఆమె మాట్లాడినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

ఈ విషయమై విపక్ష పార్టీలతో చర్చలు జరిపి, రాష్ట్రపతి అభ్యర్థిపై ఏకాభిప్రాయం తీసుకువచ్చే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేకు సోనియా గాంధీ అప్పగించారు. దీనిపై ఖర్గే ఎన్డీయేతర, యూపీయేతర పార్టీల ఆలోచనలు తెలుసుకుంటారు. పలు విపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించి అభ్యర్థుల పేర్లను తెలుసుకోనున్నట్లు సమాచారం.

Venkaiah Naidu: రాష్ట్రపతి ఎవరు అవుతారో!.. వెంకయ్యకు పదోన్నతి సాధ్యమేనా?

ఇదిలా ఉండగా.. నిన్న భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం వచ్చేనెల 24వ తేదీతో ముగుస్తున్న నేపథ్యంలో కొత్త ప్రథమ పౌరుడి ఎన్నిక తేదీని నిన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్రపతి ఎన్నికకు జూన్‌ 15న నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. జులై 18న ఓటింగ్‌ నిర్వహిస్తారు. 21న ఓట్ల లెక్కింపు ఉంటుంది. అన్ని రాష్ట్రాల ఎన్నికల కమిషన్ల అధికారులు కూడా ఈసీ ప్రకటించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. కొత్త రాష్ట్రప‌తి ఎవ‌ర‌న్నది జులై 21న జ‌ర‌గ‌నున్న ఓట్ల లెక్కింపుతో తేలిపోనుంది.