PM Modi: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరాన్ని బుల్డోజ్ చేస్తారని ఆయన ఆరోపించారు. బుల్డోజర్లు ఎక్కడ నడపాలనే విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గర ట్యూషన్ తీసుకోవాలని శుక్రవారం అన్నారు. బీజేపీ హ్యాట్రిక్ సాధించబోతోందని, కొత్త ప్రభుత్వంలో పేదలు, యువత, మహిళలు, రైతుల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, దాని కోసమే తాను ఇక్కడికి వచ్చానని బారాబంకీ, మోహన్‌లాల్ గంజ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. జూన్ 4 ఎంతో దూరం లేదని, ఆ రోజు మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని దేశానికి, ప్రపంచానికి తెలుసని చెప్పారు.
Read Also: Shocking incident: ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..
దేశ ప్రయోజనాల కోసం బీజేపీ-ఎన్డీయే కూటమి ఒక వైపు ఉంటే మరోవైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు ‘ఇండియా కూటమి’ ఉందని విమర్శించారు. ఎన్నికలు పురోగమిస్తున్నా కొద్దీ ఇండియా కూటమిని ప్రజలు పేకమేడలా కూల్చేస్తున్నారని అన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఎంపీలు కావాలి కానీ, మోడీని తిట్టేవారు కాదని అందుకు మీరు బీజేపీకి ఓటేయాలని ప్రజల్ని కోరారు. 100 సిసి ఇంజన్‌తో 1000 సిసి స్పీడ్‌ని సాధించగలరా? మీరు వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటే, బలమైన ప్రభుత్వం మాత్రమే దానిని అందించగలదని చెప్పారు.
రామనవమి రోజు సమాజ్‌వాదీ పార్టీ నేత ఒకరు రామ మందిరం పనికి రాదని అన్నారు. అదే సమయంలో రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని, వారికి వారి కుటుంబం, అధికారం మాత్రమే ముఖ్యమని ఆరోపించింది. ఎస్పీ-కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ్ లల్లాను మరోసారి గుడారంలోకి పంపి, గుడిని కూల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. బుల్డోజర్లు ఎక్కడ ఉపయోగించాలో యోగి దగ్గర ట్యూషన్ తీసుకోవాలని, యోగి ప్రభుత్వం రాష్ట్రంలో నేరస్తుల ఆస్తుల్ని బుల్డోజర్లను ఉపయోగించి ధ్వంసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు రాజకీయాల కంటే ఏదీ ఎక్కువ కాదని చెప్పారు. ట్రిపుల్ తలాక్ పట్ల మహిళలు సంతోషంగా ఉన్నారని మోడీ అన్నారు.