Site icon NTV Telugu

MK Stalin: ఆ పదవిని అవమానించారు.. గవర్నర్ రవిపై స్టాలిన్ ధ్వజం

Mk Stalin

Mk Stalin

తమిళనాడులో ప్రభుత్వానికి-రాజ్‌భవన్ మధ్య రగడ నడుస్తోంది. అసెంబ్లీ సమావేశాల నుంచి గవర్నర్ ఎన్.రవి అర్థాంతరంగా నిష్క్రమించారు. జాతీయ గీతానికి బదులు.. రాష్ట్ర గీతాన్ని ఆలపించడంపై అసంతృప్తి చెంది వెంటనే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. ఇలా జరగడంతో ఇది మూడోసారి. తాజా ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ఘాంతపోయింది.

తాజాగా ఇదే అంశంపై గవర్నర్ తీరును ముఖ్యమంత్రి స్టాలిన్ తప్పుపట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రసంగాన్ని చదవకుండా గవర్నర్ పదవిని అవమానించారని ఆరోపించారు. గతంలో తమిళనాడు చాలా మంది గవర్నర్లను చూసిందని.. వారంతా రవి లాంటి వారు కాదని అన్నారు. గవర్నర్ చర్యలను విమర్శించాల్సిన పరిస్థితి తనకు వచ్చిందని వ్యాఖ్యానించారు. ‘‘మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జయలలిత హయాంలో చూడని సంక్షోభాన్ని నేను ఎదుర్కొంటున్నాను. గవర్నర్ (రవి) అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో ప్రసంగాన్ని చదవకుండా.. అసెంబ్లీ సమావేశం ప్రారంభంలో జాతీయ గీతం ప్లే చేయాలని పట్టుబట్టడం ద్వారా తన పదవిని అవమానిస్తున్నారు.’’ అని అసెంబ్లీకి ఇచ్చిన సమాధానంలో స్టాలిన్ అన్నారు.

తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ముగింపులో ఎల్లప్పుడూ జాతీయ గీతం వినిపించబడుతుందని, ప్రారంభంలో తమిళ మాతృ ప్రార్థన వినిపించబడుతుందని స్టాలిన్ అన్నారు. ‘‘దేశభక్తిలో మేము ఎవరికీ తక్కువ కాదు.. ఎవరూ మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఈ సంక్షోభం తనకు కొత్త కాదు. నేను గతంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. వాటిని అధిగమించాను.’’ అని స్టాలిన్ తెలిపారు.

Exit mobile version