Mamata Banerjee: ఢిల్లీలో సీఎం మమత.. భద్రతగా బెంగాల్ పోలీసులు.. ఏం జరుగుతోంది?

  • ఢిల్లీలో కొనసాగుతున్న సీఎం మమత టూర్
  • ఢిల్లీ పోలీసులను వెళ్లిపోమన్న మమత
  • భద్రతగా బెంగాల్ పోలీసులు రాక
  • ఈసీ అవమానించిందన్న సీఎం మమత
Mamata Banerjee

Mamata Banerjee

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం హస్తినలో పర్యటిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ‘సర్’పై పోరాటం చేస్తున్నారు. సోమవారం మమతతో పాటు మరో ఇద్దరికి ఎన్నికల సంఘం అపాయింట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను మమత కలిశారు. అనంతరం ఆమె బయటకు వచ్చి జ్ఞానేష్ కుమార్ తనను అవమానించారని…అగౌరవపరిచారని ఆరోపించారు. అందుకే ఈసీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసినట్లు చెప్పారు. అయినా కూడా ఎన్నికల సంఘం నుంచి న్యాయం జరుగుతుందని ఆశించడం భ్రమ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే తనతో జ్ఞానేష్ కుమార్ చెడుగా మాట్లాడారని వ్యాఖ్యానించారు. అయితే మమత బెనర్జీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఆమెనే టేబుల్‌ను గట్టిగా కొట్టి వెళ్లిపోయారని తెలిపింది.

ఇది కూడా చదవండి: Stock Market: ట్రేడ్ డీల్‌తో పండిన ఇన్వెస్టర్లకు పంట.. రూ.20 లక్షల కోట్ల సంపాదన

ఇదిలా ఉంటే ఢిల్లీ పోలీసులపై నమ్మకం లేదో.. ఏమో తెలియదు గానీ.. ఢిల్లీలో ఉన్న బంగాల్‌కు చెందిన భవన్‌‌కు కాపలాగా బెంగాల్ నుంచి భద్రతా సిబ్బందిని రప్పించారు. చాణక్యపురిలోని బంగాల్ భవన్‌ దగ్గర బెంగాల్ పోలీసులు మోహరించారు. 22 మంది సభ్యుల బృందం నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీ పోలీసులు బెంగాల్ ప్రజలను బెదిరిస్తున్నారని మమత ఆరోపించారు. ‘‘మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు. మా ప్రజలకు ఎందుకు బెదిరిస్తున్నారు. వారు న్యాయం కోసం ఇక్కడికి వచ్చారు. అమాయక గ్రామస్తులను వేధించొద్దు.’’ అంటూ ఢిల్లీ పోలీసులపై మమత ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఇది కూడా చదవండి: Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం ఎందుకు? అసలు అందులో ఏముంది?

త్వరలో బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రత్యేక సర్వే చేపట్టి లక్షల ఓట్లను తొలగించింది. ఈ వ్యవహారంపై మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ తీరును తప్పుపట్టి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఈసీ బృందాన్ని కలిసి ఆగ్రహం వ్యక్తం చేసి బయటకు వచ్చేశారు. మొత్తానికి ఎన్నికల ముందు ‘సర్’ వ్యవహారం దుమారం రేపుతోంది.