NTV Telugu Site icon

CM Ashok Gehlot: కోటాలో విద్యార్థుల మృతిపై సీఎం సీరియస్‌.. నిరోధానికి కమిటీ ఏర్పాటు

Cm Ashok Gehlot

Cm Ashok Gehlot

CM Ashok Gehlot: రాజస్థాన్‌లోని కోటాలో జరుగుతున్న విద్యార్థుల మృతిపై ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ సీరియస్‌ అయ్యారు. విద్యార్థుల మరణాలను నిరోధించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. కోటాలో పెరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యల కేసులపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆందోళన వ్యక్తం చేశారు. మరణాలను నిరోధించడానికి సూచనలు అందించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కమిటీ 15 రోజుల్లో నివేదికను సమర్పిస్తుందని ప్రకటించారు. కోచింగ్‌ హబ్‌లో ఐఐటీ, నీట్‌ ఔత్సాహికుల ఆత్మహత్యల కేసులపై సీంఎ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులపై భారం మోపడాన్ని ఎత్తిచూపారు. 9వ, 10వ తరగతుల విద్యార్థులను కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేర్చడం ద్వారా తల్లితండ్రులు నేరం చేస్తున్నారని.. ఇది తల్లిదండ్రుల తప్పుని అన్నారు. విద్యార్థులు బోర్డు పరీక్షలను క్లియర్ చేసుకోవడంతోపాటు.. ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే భారాన్ని ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఉందన్నారు. ఒక్కరు చనిపోయినా తల్లిదండ్రులకు తీరని లోటని ముఖ్యమంత్రి అన్నారు.

Read also: Nagarjuna : క్రేజీ టైటిల్ తో తెరకెక్కబోతున్న నాగార్జున కొత్త సినిమా..?

కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ల ప్రతినిధులతోపాటు తల్లిదండ్రులు మరియు వైద్యులతో సహా అన్ని వర్గాలకు చెందిన వారితో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ 15 రోజుల్లో తన నివేదికను సమర్పించనుంది. కోటాలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారిలో ఈ ఏడాది ఇప్పటికే 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. గతేడాది మొత్తంలో 15 మంది ఆత్మహత్యలకు పాల్పడగా.. ఈ ఏడాది ఇప్పటికే ఆ సంఖ్య 22కి చేరిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లు డబ్బు సంపాదించే యంత్రాలుగా మారవద్దని విద్యాశాఖ సహాయ మంత్రి జాహిదా ఖాన్ కోరారు. ఇది కేవలం రాజస్థాన్‌ సమస్య మాత్రమే కాదని.. యావత్‌ దేశానికి సంబంధించిన సమస్య అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) డేటాను కూడా సమావేశంలో చర్చించినట్టు తెలిసింది. ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం 2021లో సుమారు 13,000 మంది విద్యార్థులు ఆత్మహత్యల ద్వారా మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 1,834 మరణాలు నమోదుకాగా.. మధ్యప్రదేశ్‌లో1,308 మంది, తమిళనాడులో 1,246 మంది, కర్ణాటకలో 855 మంది, ఒడిశాలో 834 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్టు నివేదికలో ప్రకటించారు.