పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి అధికారంలోకి వచ్చింది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఇక, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ పగ్గాలు చేపట్టిన తర్వాత.. పలు కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతున్నారు.. ఇక, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌ను తక్షణం పంజాబ్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తోంది పంజాబ్ సర్కార్.. దీనిపై పంజాబ్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేంద్రపాలిత ప్రాంతం నిర్వహణలో సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించిన సీఎం.. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 1966 ప్రకారం, పంజాబ్ రాష్ట్రాన్ని హర్యానా రాష్ట్రంగా, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడంతోపాటు పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలను అప్పటి కేంద్ర పాలిత ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్‌కు ఇచ్చారని.. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో పేర్కొన్నారు.
ఇక, అప్పటి నుంచి భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డ్ వంటి ఉమ్మడి ఆస్తుల నిర్వహణలో పంజాబ్, హర్యానా రాష్ట్ర నామినీలకు కొంత నిష్పత్తిలో మేనేజ్‌మెంట్ పదవులు ఇవ్వడం ద్వారా సమతుల్యం పాటిస్తున్నారని తెలిపారు సీఎం భగవంత్ మాన్.. అయితే ఇటీవల అనేక చర్యల ద్వారా ఈ సమతుల్యతను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.. పంజాబ్, హర్యానా రాష్ట్రాల అధికారులతో సాంప్రదాయకంగా భర్తీ చేసే భాక్రా బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డు సభ్యుల పోస్టులను అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో భర్తీ కోసం కేంద్రం ప్రకటన జారీ చేసిందని విమర్శలు గుప్పించారు.. మరోవైపు.. చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్‌లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు లభిస్తాయని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించడం చర్చగా మారింది.. చండీగఢ్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచుతున్నట్లు తెలిపారు. అయితే, అమిత్ షా ప్రకటన పంజాబ్‌లో పెద్ద దుమారం రేపింది. చండీగఢ్‌పై పంజాబ్ పెత్తనాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని ఆ రాష్ట్రం ఆరోపిస్తోంది.