NTV Telugu Site icon

Cloudburst: అరుణాచల్‌లో ‘‘క్లౌడ్ బరస్ట్’’.. రాష్ట్రంలో భారీ వరదలు..

Arunachal

Arunachal

Cloudburst: ఈశాన్య రాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతోంది. ‘‘క్లౌడ్ బరస్ట్’’ కారణంగా ఆ రాష్ట్రంలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాల్లో వరదలు పెరిగాయి. ఇటానగర్‌లో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది. వరదల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇదిలా ఉంటే పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి.

పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజలకు సాయం చేసేందుకు రెస్క్యూ కార్యక్రమాలు ప్రారంభించారు. అంతకుముందు మంగళవారం కురిసిన భారీ వర్షాలకు కర్సింగ్సా ప్రాంతంలో భారీ నష్టం సంభవించింది. నిర్జులి నుంచి బాండేర్‌దేవా వరకు ఉన్న రహదారిని మూసేశారు. ముఖ్యంగా, భారీ వర్షాల కారణంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అనేక చోట్ల కొండచరియలు విరిగిపడిన సంఘటనలు నమోదయ్యాయి.

Read Also: Rahul Gandhi: ‘‘నా దు:ఖాన్ని మీరంతా చూసే ఉంటారు’’.. రాహుల్ గాంధీ భావోద్వేగ లేఖ..

రాబోయే ఐదు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వాతావరణ సూచనను విడుదల చేసింది. రాబోయే ఏడు రోజుల పాటు అరణాచల్ వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది.

దాదాపుగా 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్ల కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైతే దానిని ‘క్లౌడ్ బరస్ట్’గా వ్యవహరిస్తుంటారు. ఒక్కసారిగా తక్కవ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదు కావడంతో వరదలు ఉప్పెనలా విరుచుకుపడుతాయి. ముఖ్యంగా కొండలు, హిమాలయ ప్రాంతాల్లో ఈ వర్షాలు మరింత ప్రమాదకరంగా మారుతుంటాయి.