జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. దోడాలో మేఘావృతం కారణంగా ఒక్కసారిగా ఆకస్మిక వరదలు సంభవించాయి. నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. పది ఇళ్లులు ధ్వంసమయ్యాయి. ఆగస్టు 27 వరకు జమ్మూ డివిజన్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ఇటీవలే కథువా, కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇది మరువక ముందే మరొకసారి ఆకస్మిక వరదలు హడలెత్తించాయి.
ఇది కూడా చదవండి: China: ఒకే వేదికపైకి మోడీ-పుతిన్-జిన్‌పింగ్.. ఆసక్తి రేపుతున్న సమావేశం
కథువా, సాంబా, దోడా, జమ్మూ, రాంబన్, కిష్త్వార్ జిల్లాలతో సహా జమ్మూ ప్రాంతంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఈ క్లౌడ్ బరస్ట్ జరిగింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా జమ్మూ డివిజన్ అంతటా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇది కూడా చదవండి: DK Shivakumar: గాంధీ కుటుంబమే నాకు దేవుడు.. ఆర్ఎస్ఎస్ గీతాలాపనపై శివకుమార్ క్లారిటీ
కొండచరియలు విరిగిపడటం, రాళ్ళు విరిగిపడటం వంటి కారణాలతో ముందు జాగ్రత్త చర్యగా జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేశారు. దోడాలోని ఒక కీలక రహదారి కొట్టుకుపోయింది. ఇక తావి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అనేక నదులు, వాగులలో నీటి మట్టం ఇప్పటికే ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. రాత్రికి మరింత పెరుగుదల ఉంటుందని అధికారులు తెలిపారు. దుర్బల ప్రాంతాల్లో రెస్క్యూ, రిలీఫ్ బృందాలను అప్రమత్తంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.
వారాంతంలో జమ్మూలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. 24 గంటల్లో 190.4 మి.మీ వర్షపాతం నమోదైంది. వందేళ్లలో ఆగస్టు నెలలో ఇది రెండవ అత్యధిక వర్షపాతం. ఆగస్టు 5, 1926న 228.6 మి.మీ అత్యధిక వర్షపాతం నమోదైంది. రెండవ అత్యధిక వర్షపాతం ఆగస్టు 11, 2022న 189.6 మి.మీ. నమోదైంది. ఇటీవల 190.4 మి.మీ వర్షపాతం రికార్డ్ సృష్టించింది.
