Site icon NTV Telugu

Congress: రామమందిర కార్యక్రమానికి వెళ్లేది లేదన్న కాంగ్రెస్ పార్టీ.. “అది ఆర్ఎస్ఎస్/బీజేపీ ఈవెంట్”..

Ram Nandir

Ram Nandir

Congress: అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ వేడుకలకు కాంగ్రెస్ వెళ్తుందా..? లేదా..? అనే సందేహాలకు తెరపడింది. ఈ కార్యక్రమానికి తాము హాజరయ్యేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. రామ మందిర వేడుక పూర్తిగా ఆర్ఎస్ఎస్, బీజేపీల కార్యక్రమంగా ఉందని ఆరోపించింది. జనవరి 22న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవం జరగబోతోంది. రామ్ లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి లక్షల మందిలో ప్రజలు హాజరవబోతున్నారు. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా, దేశంలోని 7000 మంది ప్రముఖులకు రామాలయ ట్రస్టు ఆహ్వానాలను పంపింది.

Read Also: Maldives Row: ‘‘దయచేసి విమాన బుకింగ్స్ ఓపెన్ చేయండి’’.. ‘ఈజ్‌మైట్రిప్’కి మాల్దీవ్స్ సంఘం వేడుకోలు..

రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు అధిర్ రంజన్ చౌదరిలకు ఆహ్వానం అందించింది. రామ మందిరం బీజేపీ దాని రాజకీయ గురువు ఆర్ఎస్ఎస్ ‘‘రాజకీయ ప్రాజెక్టు’’ అని కాంగ్రెస్ ఈ రోజు ప్రకటించింది. ఆహ్వానం అందుకున్న ముగ్గురు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు తిరస్కరించినట్లు పార్టీ తెలిపింది.

‘‘మతం అనేది వ్యక్తగత విషయం. కానీ ఆర్ఎస్ఎస్/బీజేపీ చాలా కాలంగా అయోధ్యలో ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చింది. అసంపూర్తిగా ఉన్న ఆలయ ప్రారంభోత్సవాన్ని బీజేపీ రాజకీయ లాభం కోసం స్పష్టంగా ముందుకు తీసుకువచ్చారు’’ అని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ‘‘2019 సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి, శ్రీరాముడిని గౌరవించే లక్షలాది మంది మనోభావాలను గౌరవిస్తూ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే, శ్రీమతి సోనియా గాంధీ మరియు శ్రీ అధీర్ రంజన్ చౌదరిలు స్పష్టంగా ఆర్ఎస్ఎస్/బీజేపీ ఈవెంట్‌కి ఆహ్వానాన్ని తిరస్కరించారు’’ అని తెలిపారు.

Exit mobile version