CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఢిల్లీ నిరసనల తర్వాత వరస కేసుల్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేతలు ఇప్పడు మళ్లీ కొత్త కార్యక్రమానికి తెర తీశారు. ‘‘క్యా బోల్తీ పబ్లిక్’’(ప్రజలు ఏమంటున్నారు) అనే కార్యక్రమం ద్వారా జాతీయ ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. నవంబర్ 22న గోవా నుంచి ఈ ప్రచారానికి శ్రీకారం చుట్టనుంది. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, వారి అభిప్రాయాలను వినడం, స్థానికంగా పరిష్కారం కావాల్సిన అంశాలను గుర్తించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేమని సీజేపీ చెబుతోంది.
ఈ కార్యక్రమానికి సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే నాయకత్వం వహించనున్నారు. గోవాలో సీజేపీ నాయకురాలు ఆఫ్రీన్ షేక్ గురువారం పనాజీలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. నవంబర్ 22న పనాజీ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ నాయకులు అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరభ్ దాస్ కూడా ఇందులో పాల్గొంటారని ఆమె తెలిపారు.
గోవా ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో సీజేపీ ప్రచారం ప్రారంభించడం గమనార్హం. గోవాలో ప్రస్తుతం ఎదురవుతున్న భూ వివాదాలు, ప్రజా భద్రత, రవాణా, కార్మికుల హక్కులు, విద్య వంటి అంశాలపై ప్రజల అభిప్రాయాలను సేకరించనున్నారు. అయితే, ఈ కార్యక్రమానికి ఎలాంటి రాజకీయ సిద్ధాంతాలతో, రాజకీయ పార్టీలతో అనుబంధం లేదని సీజేపీ చెబుతోంది. రాజకీయ నేపథ్యంతో సంబంధం లేని ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించవచ్చని తెలిపింది.

