CJI Surya Kant: లండన్‌లో సీజేఐ సూర్యకాంత్‌కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు

  • లండన్‌లో సీజేఐ సూర్యకాంత్ ప్రసంగానికి అంతరాయం
  • కాక్రోచ్ వ్యాఖ్యల ప్రశ్నలతో వివాదం
  • షాక్‌కు గురైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
Cji Surya Kant

Cji Surya Kant

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు లండన్‌లో అవమానం జరిగింది. ప్రసంగ సమయంలో కొందరు భారతీయులు అడ్డు తగిలారు. దీంతో గందరగోళం నెలకొంది. ఈ పరిణామంతో సీజేఐ సూర్యకాంత్ షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

సీజేఐ సూర్యకాంత్ లండన్ పర్యటనకు వెళ్లారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని బిర్క్‌బెక్ యూనివర్సిటీలో జూన్ 4న జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నేషనల్ లా’’ అంశంపై ఉపన్యాసం ఇచ్చారు. అయితే కార్యక్రమంలో పాల్గొన్న కొందరు భారతీయులు.. భారతదేశంలో భిన్నాభిప్రాయాల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై… అలాగే ఇటీవల సుప్రీంకోర్టులో సీజేఐ చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై ప్రశ్నలు లేవనెత్తడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది.

×
×
Ad

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. ఓ వ్యక్తి మాట్లాడుతూ.. “భారత్‌లో భిన్నాభిప్రాయాల పట్ల పెరుగుతున్న శత్రుత్వంపై దేశీయ, అంతర్జాతీయ న్యాయ పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ ధోరణి మీ వ్యాఖ్యల్లో కూడా ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తోంది.’’ అని ప్రశ్నించారు. మరో వ్యక్తి మే 15న కోర్టు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ చేసిన ‘కాక్రోచ్’ వ్యాఖ్యల గురించి ప్రశ్నించేందుకు ప్రయత్నించారు. అయితే కార్యక్రమ నిర్వాహకులు, మోడరేటర్ ప్రశ్నించేందుకు అనుమతించలేదు. ఈ కార్యక్రమం కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలపై కేంద్రీకృతమై ఉందని.. ప్రశ్నలను పరిగణనలోకి తీసుకోబోమని మోడరేటర్ స్పష్టం చేశారు. అయినా కూడా గందరగోళం నెలకొంది. కొందరు ప్రేక్షకులు లేచి అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కార్యక్రమంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వీడియోల్లో నిర్వాహకులు ప్రేక్షకులను శాంతించాలని కోరుతూ కనిపించారు. దయచేసి ప్రశాంతంగా ఉండండి. కార్యక్రమాన్ని కొనసాగనివ్వండని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. అయినా కూడా రచ్చ రచ్చ అయింది.

భారత హైకమిషన్ ఖండన

ఈ ఘటనపై యూకేలోని భారత హైకమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కార్యక్రమం అనంతరం విడుదల చేసిన ప్రకటనలో కొందరు వ్యక్తుల ప్రవర్తనను “అసభ్యకరమైనది, అనుచితమైనది”గా అభివర్ణించింది. “భిన్నాభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో సహజం. అయితే వాటిని మర్యాదపూర్వకంగా, గౌరవప్రదంగా వ్యక్తపరచాలి. కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదు” అని హైకమిషన్ పేర్కొంది.

మే 15న అసలేం జరిగిందంటే…

సుప్రీంకోర్టులో అడ్వకేట్ సంజయ్ దూబే దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ నియామకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయడంలో ఆలస్యం చేస్తోందని ఆరోపిస్తూ దూబే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణలో సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం పిటిషనర్ వైఖరిని ప్రశ్నించింది. ‘‘సీనియర్ అడ్వకేట్ ట్యాగ్ అనేది కేవలం ప్రతిష్ఠ కోసమా? లేక న్యాయవ్యవస్థలో భాగస్వామ్యం కోసమా?” అని బెంచ్ ప్రశ్నించింది. అదే సమయంలో న్యాయవ్యవస్థపై కొంతమంది దాడులు చేస్తున్నారని సీజేఐ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సమాజంలో కొంతమంది పరాన్నజీవులు వ్యవస్థపై దాడి చేస్తున్నారు. ఉద్యోగం దొరకదు.. వృత్తిలో స్థానం ఉండదు.. కొందరు మీడియాగా మారతారు.. కొందరు సోషల్ మీడియా కార్యకర్తలవుతారు.. ఇంకొందరు ఆర్టీఐ యాక్టివిస్టులవుతారు.. తర్వాత అందరిపై దాడులు మొదలుపెడతారు.’’ అని వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే “ఉద్యోగాలు దొరకని కొంతమంది యువకులు కాక్రోచ్‌లు మాదిరిగా మారుతున్నారు.” అని సీజేఐ వ్యాఖ్యానించినట్టుగా బయటకు రావడంతో పెను దుమారానికి దారి తీసింది.

నకిలీ లా డిగ్రీలపై సీజేఐ ఆందోళన

ఇక విచారణ సందర్భంగా సీజేఐ మరో కీలక వ్యాఖ్య కూడా చేశారు. “వేలాది మంది నకిలీ డిగ్రీలతో నల్ల కోట్లు ధరించి తిరుగుతున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేయాలి” అని అన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకునే పరిస్థితిలో లేదని.. కొంతమంది కలిసి పనిచేస్తున్నారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. చివరికి పిటిషనర్ సంజయ్ దూబే కోర్టుకు క్షమాపణలు చెప్పి తన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరగా.. ధర్మాసనం ఆమోదించింది.

అయితే సీజేఐ వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. విపక్ష పార్టీలు తీవ్రంగా తప్పుపట్టాయి. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కూడా సీజేఐ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. “దేశ న్యాయవ్యవస్థ అధినేత నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం బాధాకరం. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం” అని పేర్కొంది. సీజేఐ వ్యాఖ్యలపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ కుమార్ ఝా కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. NEET, CBSE పరీక్షల వివాదాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ పరిణామాల మధ్య లండన్‌లో జరిగిన సీజేఐ కార్యక్రమం గందరగోళానికి గురైంది. వాస్తవానికి మరుసటి రోజే సీజేఐ వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా దుమారం రేగింది.