సీజేఐ సూర్యకాంత్‌పై సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది ప్రదీప్ రాయ్ ప్రశంసలు కురింపించారు. ‘‘తండ్రిలాంటి వ్యక్తి.. ఎప్పుడైనా సంప్రదించగలిగే వ్యక్తి’’గా అభివర్ణించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రదీప్ రాయ్ భారీ ఘన విజయం అందుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం సీజేఐ మార్గదర్శకత్వంలో పనిచేస్తుందని… న్యాయమూర్తులకు అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రదీప్ రాయ్ విజయం
సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. అదే రోజు అర్ధరాత్రి తర్వాత ఫలితాలను ప్రకటించారు. అధ్యక్ష పదవికి పోటీ చేసిన ప్రదీప్ రాయ్‌కు 822 ఓట్లు లభించాయి. ఆయన సమీప ప్రత్యర్థి సీనియర్ న్యాయవాది అనుపమ్ లాల్ దాస్‌కు 451 ఓట్లు వచ్చాయి. ఇతర అభ్యర్థుల్లో సీనియర్ న్యాయవాది అదీష్ అగర్వాలాకు 412 ఓట్లు, గౌరవ్ భాటియాకు 370, సుకుమార్ పట్టజోషికి 269, సిద్ధార్థ్ మృదుల్‌కు 217, మహాలక్ష్మి పవానికి 128 ఓట్లు లభించాయి.
‘బార్, బెంచ్‌ది చిన్న కుటుంబం’
సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. బార్, బెంచ్ అనేవి ‘‘చిన్న కుటుంబం’’ లాంటివని పేర్కొన్నారు. ‘‘మనం ఎప్పుడూ ఒకరినొకరం చూసుకున్నాం. ఇకపై కూడా ఇదే సమన్వయంతో కూడిన సంబంధాన్ని కొనసాగిస్తాం’’ అని ఆయన కొత్తగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను అభినందించారు. న్యాయవ్యవస్థ, బార్ మధ్య సన్నిహితమైన, సమన్వయంతో కూడిన సంబంధం కొనసాగడం ఎంతో ముఖ్యమని సీజేఐ పేర్కొన్నారు. కొత్త కార్యవర్గం తమ పనితీరుతో ఇతరులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడేందుకు అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.
‘బెంచ్‌కు 100 శాతం సహకరిస్తాం’
సీజేఐ వ్యాఖ్యలకు స్పందించిన ప్రదీప్ రాయ్.. బెంచ్‌కు పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు. ‘‘మై లార్డ్స్.. ఈ బార్ మొత్తం మీ వెంటే ఉంది. మేం 100 శాతం సహకరిస్తాం. బెంచ్‌కు అన్ని విధాలా మద్దతు అందిస్తాం’’ అని రాయ్ హామీ ఇచ్చారు. ప్రదీప్ రాయ్ గతంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎన్నికలకు ముందు న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించిన పలు చర్యలు చేపడతామ హామీ ఇచ్చారు. 2025లో అధ్యక్షుడిగా ఎన్నికైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ స్థానంలో ఇప్పుడు ప్రదీప్ రాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు.

