CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నేడు పదవీ విరమణ చేస్తున్నారు. పదవీ విరమణ సందర్భంగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తనకు జీవితంలో ఎదురైన అనేక విషయాలను గుర్తుచేసుకున్నారు. జీవితంలో తనకు విద్య నేర్పిన గురువులకు, స్ఫూర్తినిచ్చిన వారికి రుణపడి ఉంటానని ఆయన తెలిపారు. 12 ఏళ్ల వయసులో తొలిసారి కరెంటు చూసినట్లు పేర్కొన్నారు. 17 ఏళ్లకు ట్రేడ్ యూనియన్‌కు నేతృత్వం వహించానని తెలిపారు. ఈ వృత్తిలో అనేక ఒడిదొడుకులు వస్తాయని న్యాయవాదులు గ్రహించాలని సూచించారు. సొంత లాభం కొంత మానుకుని పొరుగువానికి తోడ్పడవోయ్ అనే గురజాడ సూక్తిని ప్రస్తావించారు. ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెడితే కొద్దికాలంలోనే హింస, వివాదాలకు తావులేని సరికొత్త, స్వచ్ఛమైన ప్రపంచాన్ని చూడగలమని అన్నారు. కనీస వసతులు లేని గ్రామం నుంచి తన ప్రస్థానం మొదలైందని, వృత్తి పరంగా జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని తెలిపారు.. తాను గొప్ప న్యాయమూర్తిని కాకపోవచ్చు కానీ, సామాన్యుడికి న్యాయం అందించడానికి కృషి చేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ స్పష్టం చేశారు.
కోర్టుల్లో విచారణ ప్రత్యక్ష ప్రసారాల కోసం జస్టిస్ ఎన్వీ రమణ చాలా కాలం నుంచి కృషి చేస్తూ వచ్చారు. ఆయన పదవీ విరమణ చేస్తున్న నేడు ఆ ప్రక్రియకు కార్యరూపం ఇచ్చారు. ఫలితంగా జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం చేపట్టిన కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం చేశారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలు, కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసుల విచారణను ప్రత్యక్షప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే వెసులుబాటు కల్పించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరగాలని ఆయన ఆకాంక్షించారు. సాంకేతిక మార్పులను న్యాయవ్యవస్థ అందిపుచ్చుకోవాలని సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా తన హయాంలో 50 దినాల కంటే ఎక్కువ పూర్తిస్థాయి విచారణ జరగకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ కేసులు పెద్ద సవాలుగా నిలిచాయన్న ఆయన.. కేసుల లిస్టింగ్, విచారణ తేదీల ఖరారుపైఎక్కువ దృష్టి కేంద్రీకరించలేకపోయినట్లు విచారం వ్యక్తం చేశారు.
Congress: కాంగ్రెస్‌కు మరో షాక్.. ఆజాద్‌కు మద్దతుగా 5గురు నేతలు రాజీనామా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు భావోద్వేగానికి లోనయ్యారు. జస్టిస్ ఎన్వీ రమణ పనితీరుపై న్యాయవాదులు ప్రశంసల వర్షం కురిపించారు. సీజేఐగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని.. న్యాయవ్యవస్థకు ఆయన సేవలు మరవలేనివన్నారు. కార్యనిర్వాహక, పార్లమెంటరీ, న్యాయ వ్యవస్థల మధ్య సమతూకం పాటించారంటూ సీనియర్ న్యాయవాది ధుష్యంత్ దవే.. జస్టిస్ రమణ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగంతో కన్నీటి పర్యంతం అయ్యారు. జస్టిస్ రమణ ప్రజల న్యాయమూర్తి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ప్రజల పక్షాన నిలబడి వారి హక్కులు సహా రాజ్యాంగం పక్షాన నిలిచారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు హుందాతనం, సమగ్రతను పరిరక్షించారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. జస్టిస్ రమణ హయాంలో వివిధ హైకోర్టుల్లో 224మంది న్యాయమూర్తుల ఖాళీలను భర్తీ చేసినట్లు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గుర్తుచేశారు. తొలిసారి సుప్రీంకోర్టులో పూర్తిస్థాయిలో 34 మంది న్యాయమూర్తులు ఉన్నారని పేర్కొన్నారు. వివిధ ట్రైబ్యునళ్లలో 100మందికిపైగా సభ్యులను నియమించినట్లు వెల్లడించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ సేవలను కొనియాడారు.
Bharatiya Janata Party : ఆ పార్టీ నేతలకు అసంతృప్తే మిగిలిందా..?
సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ విశేష సేవలు అందించారు. 13ఏళ్లపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా రమణ పనిచేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎదిగారు. 2021 ఏప్రిల్ 24 నుంచి సీజేఐగా ఎన్వీ రమణ కొనసాగుతున్నారు. శనివారం 49వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యూయూ లలిత్ ప్రమాణ స్వీకారంచేయనున్నారు. రాష్ట్రపతి భవన్‍లో జస్టిస్ యూయూ లలిత్ చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఇక, యూయూ లలిత్ రెండు నెలల 12 రోజుల పాటు సీజేఐగా పదవిలో కొనసాగనున్నారు. నవంబర్ 8తో ఆయన పదవీకాలం ముగుస్తుంది.
