Site icon NTV Telugu

CJI BR Gavai: నేను లౌకికుడిని.. ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నా.. వీడ్కోలు ప్రసంగంలో గవాయ్ వ్యాఖ్య

Cji Br Gava

Cji Br Gava

తాను లౌకికవ్యక్తినని.. కానీ ప్రస్తుతం బౌద్ధమతాన్ని ఆచరిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్ అన్నారు. నవంబర్ 23న గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. శుక్రవారం (21-11-2025) గవాయ్‌ది చివరి పని దినం. దీంతో ఒకరోజు ముందుగానే గురువారం సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ (SCAORA) వీడ్కోలు కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గవాయ్ ప్రసంగించారు.

ఇది కూడా చదవండి: Al-Falah University: ఢిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. అల్-ఫలాహ్ సంస్థ అధినేత ఇల్లు కూల్చివేతకు నోటీస్

తాను బౌద్ధమతాన్ని తన విశ్వాసంగా ఆచరిస్తున్నట్లు తెలిపారు. కానీ హిందూ మతం, సిక్కు, ఇస్లాం సహా ఇతర మతాలను గౌరవిస్తానని చెప్పారు. నిజమైన లౌకిక వ్యక్తినని చెప్పుకొచ్చారు. ఇదంతా తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నట్లు తెలిపారు. నిజమైన లైకికుడు డాక్టర్ భీమ్‌రావు అంబేద్కర్ అన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయమూర్తిగా ఉన్నానంటే.. దీనికంతటికి కారణం అంబేద్కర్ చలువే అన్నారు.

ఇది కూడా చదవండి: G20 Summit: జీ20 సమ్మిట్‌కు ట్రంప్ గైర్హాజరు.. మోడీ హాజరు

దేశంలోని న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎక్కడో మున్సిపల్ పాఠశాలలో చదువుకున్న తనకు దేశంలోని అత్యున్నత న్యాయ కార్యాలయానికి చేరుకోవడం వరకు ఇదంతా భారత రాజ్యాంగం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం అనే విలువల ద్వారానే సాధ్యమైందని గవాయ్ పేర్కొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఆరు నెలలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆరున్నర సంవత్సరాలు పని చేసినట్లు తెలిపారు. అందరి సమిష్టి సహకారాన్ని అభినందించారు. సుప్రీంకోర్టు గానీ.. ప్రధాన న్యాయమూర్తిగానీ ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తి చుట్టూ కేంద్రీకృతమై ఉండకూడదని సూచించారు. సమిష్టి నిర్ణయాలతోనే వ్యవస్థ బాగుంటుందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ పనితీరు న్యాయమూర్తులు, బార్, రిజిస్ట్రీ, సిబ్బందితో సహా అన్ని భాగస్వామ్య పక్షాలపై ఆధారపడి ఉంటుందని గవాయ్ చెప్పుకొచ్చారు.

ఇక బీఆర్.గవాయ్ వారసుడిగా జస్టిస్ సూర్యకాంత్ రానున్నారు. నవంబర్ 24, 2025న భారతదేశ 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగుతారు. దాదాపు 15 నెలల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వహించనున్నారు.

Exit mobile version