BrahMos: ఆపరేషన్ సిందూర్‌తో భారత్ పూర్తిగా పాకిస్తాన్‌పై ఆధిపత్యం చెలాయించిందని యూఎస్ యుద్ధరంగ నిపుణుడు కల్నల్(రిటైర్డ్) జాన్ స్పెన్సర్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. భారతదేశం దాడి ,రక్షణాత్మక ఆధిపత్యాన్ని ప్రదర్శించిందని ఆయన అన్నారు. భారత్ పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశాన్ని అయినా ఎప్పుడైనా, ఎక్కడైనా ఢీకొనగలమనే సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ భారతదేశ బ్రహ్మోస్ క్షిపణులను తట్టుకోలేదని ఆయన చెప్పారు.
పాకిస్తాన్ వ్యాప్తంగా దాడి చేయడంతో పాటు పాకిస్తాన్ డ్రోన్ దాడులు, హై స్పీడ్ క్షిపణుల భారత్ విజయవంతంగా ఎదుర్కుందని, తనను తాను రక్షించుకుందని స్పెన్సర్ చెప్పారు. మోడరన్ వార్ ఇన్స్టిట్యూట్‌లో అర్బన్ వార్‌ఫేర్ స్టడీస్ అధిపతిగా పనిచేస్తున్న స్పెన్సర్, పాకిస్తాన్ ఉపయోగించిన చైనీస్ వైమానిక రక్షణ వ్యవస్థను బ్రహ్మోస్ విజయవంతంగా ఛేదించిందని, ఇది భారత అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనమని అన్నారు.
Read Also: Nunna Mango Market: వెలవెలబోతున్న నున్న మామిడి మార్కెట్.. ఆందోళనకు గురవుతున్న వ్యాపారాలు!
గత వారం పాకిస్తాన్ భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. అయితే, ఇండియా వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున భారత్ బ్రహ్మోస్ క్షిపణులతో పాక్ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. 11 స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సిందూర్ పాకిస్తాన్ సైన్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని స్పెన్సర్ అన్నారు. ఈ ఘర్షణల సమయంలో భారత సమాచార వ్యాప్తి వ్యూహాన్ని ప్రశంసిస్తూనే, రాబోయే సంవత్సరాల్లో సైనిక వ్యూహాకర్తలు,విద్యార్థులు ఈ ఆపరేషన్‌ని అధ్యయనం చేస్తారని ఆయన అన్నారు.
ఉగ్రవాదంపై పాకిస్తాన్ ను ప్రపంచం ఎండగట్టే సమయం ఆసన్నమైందని, వెస్ట్రన్ దేశాలు రెండు నాలుకల విధానాన్ని ఆపాలని కోరారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని స్పెన్సర్ గట్టిగా సమర్థించారు. పాకిస్తాన్ ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే విధానంపై పునరాలోచించుకునేలా చేయడంతో ఇది సహాయపడుతుందని అన్నారు.
