India China: చైనా తన బుద్ధిని చూపిస్తూనే ఉంది. ఉగ్రవాదులకు అండగా నిలుస్తున్న పాకిస్తాన్‌తో పాటు కరుడుగట్టిన ఉగ్రవాదులపై ఆంక్షలు కోసం భారత్ చేస్తున్న అభ్యర్థనను చైనా అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ), జైషే మహ్మద్ (జెఎం) ఉగ్రవాదులను నిషేధించి, వారిని ప్రపంచ ఉగ్రవాదులుగా ప్రకటించాలన్న భారతదేశం ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి)లో పలు సందర్భాల్లో చైనా అడ్డుకున్నట్లు సమాచారం. 2025 పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఎల్‌ఇటి అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్)పై ఆంక్షలు విధించాలని భారతదేశం చేసిన అభ్యర్థన కూడా యుఎన్‌ఎస్‌సి వద్ద చైనా అడ్డుకుందని ఎకనామిక్ టైమ్స్ నివేదిక తెలిపింది.
26/11 ముంబై ఉగ్రదాడులు, 2019లో పుల్వామా దాడులు, 2016లో పఠాన్ కోట్ దాడి, 2001 పార్లమెంట్ దాడి, IC 814 హైజాక్ వంటి ఘటనలకు పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులు..అబ్దుల్ రవూఫ్ అస్గర్, సాజిద్ మీర్, అబ్దుర్ రెహమాన్ మక్కీ, తల్హా సయీద్, షాహిద్ మెహమూద్ రెహమతుల్లాపై ఆంక్షలను చైనా అడ్డుకుని, తన మిత్రదేశం పాకిస్తాన్‌కి మరోసారి సహకరించింది. వీరిపై ఆంక్షల్ని నిరోధించడంలో చైనా ప్రమేయంపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఒక రిపోర్ట్‌ని నివేదిక ఎత్తిచూపింది.
అబ్దుల్ రవూఫ్ అజా:
నివేదిక ప్రకారం, భారత్-అమెరికా జూలై 27, 2022న రవూఫ్‌ని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ప్రతిపాదన చేశాయి. ఈ ప్రతిపాదనను మే 10, 2023 వరకు మూడు నెలలు పాటు చైనా నిలిపేసింది. చివరకు మే10, 2023లో చైనా దీనిని అడ్డుకుంది.
ఇతను జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ సోదరుడు. 1999లో ఖాట్మండు నుండి కాందహార్‌కు జరిగిన ఐసి-814 హైజాక్‌కు ప్రధాన సూత్రధారి. పాకిస్తాన్‌లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేయడంలో, భారత గడ్డపై ఉగ్రవాద దాడులను సమన్వయం చేయడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. 2001 పార్లమెంటు దాడి మరియు 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడికి కూడా అజార్ ప్రధాన కుట్రదారుడు. 2019 పుల్వామ ఘటనలో కూడా ఇతడికి సంబంధం ఉంది.
సాజిద్ మీర్‌పై:
నివేదిక ప్రకారం, సాజిద్ మీర్‌ని ప్రపంచ ఉగ్రవాదిగా ప్రతిపాదనను చైనా 2023లో అడ్డుకుంది. 26/11 దాడిలో మీర్ పాత్ర కోసం అతను గాలిస్తున్నట్లు ఎన్ఐఏ పత్రంలో పేర్కొన్నారు. ఆసక్తికరంగా, అతను మే 2022లో ఉగ్రవాద నిధుల ఆరోపణలపై లాహోర్‌లో అరెస్టు చేశారు. మీర్‌ను ఆగస్టు 30, 2012న అమెరికా ప్రత్యేకంగా నియమించిన గ్లోబల్ టెర్రరిస్ట్ (SDGT)గా నియమించింది. అతను FBI మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా ఉన్నాడు.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీ:
మక్కీని UN ఆంక్షల జాబితాలో చేర్చే భారతదేశ ప్రయత్నాన్ని చైనా 2022లో మొదట అడ్డుకుంది. అయితే, 2023లో చైనా ఆంక్షలు విధించేలా సహకరించింది. దీంతో LeT రాజకీయ వ్యవహారాల విభాగం అధిపతి మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించారు. అయితే, మక్కీ చనిపోయాడని పాకిస్తాన్ UNకు చెప్పిందని, ఇతను ఇంకా బతికే ఉన్నాడని నిఘా వర్గాలు నమ్ముతున్నాయి. అతను లష్కరే తోయిబా కోసం నిధుల సేకరణలో పాల్గొన్నాడని ఆరోపణలు ఉన్నాయి.
తల్హా సయీద్:
లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ పై భారతదేశం మరియు అమెరికా ప్రతిపాదనను చైనా 2022 నుండి అడ్డుకుంది. తల్హా (50) భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ లో భారత ప్రయోజనాలను దెబ్బతీసేందుకు లష్కరే తోయిబా రిక్రూట్మెంట్లు, నిధుల సేకరణ, దాడులకు ప్లాన్ చేయడం వంటి ఆపరేషన్స్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.
షాహిద్ మెహమూద్ రెహ్మతుల్లా:
ఇతను లష్కరే తోయిబా ప్రధాన సంస్థ అయిన ఫలాహ్-ఇ-ల్న్సానియత్ ఫౌండేషన్ (FIF) సంస్థకు డిప్యూటీ చీఫ్. 2022 నుంచి ఇతడిపై ఆంక్షలు విధించే తీర్మానాన్ని చైనా అడ్డుకుంటోంది. రెహ్మతుల్లా భారతదేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం మతం ముసుగులో నిధుల్ని సేకరిస్తున్నాడు.
టీఆర్ఎఫ్ పై ఆంక్షలు:
పహల్గామ్ ఉగ్రవాద దాడికి పాల్పడిన టీఆర్ఎఫ్‌పై భారత్ సమర్పించిన మూడు ప్రతిపాదనలు 2023 డిసెంబర్‌లో , మే 2024లో, ఫిబ్రవరి 2025లో చైనా అడ్డుకుంది.