Doklam issue: మరోసారి చైనా తన దొంగబుద్ధిని చాటుకుంది. గత 8 ఏళ్లుగా భూటాన్ భూభాగమైన డోక్లామ్ సమీపంలో 22 గ్రామాలను నిర్మించినట్లు శాటిలైట్ చిత్రాల్లో తేలింది. వీటిలో 8 గ్రామాలు 2020 నుంచి వ్యూహాత్మక డోక్లామ్ పీఠభూమికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నట్లు శాటిలైట్ చిత్రాలు చూపిస్తున్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ)కి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో ఉండగా ఈ పరిణామం జరిగింది.
డోక్లామ్ పీఠభూమి భూటాన్ భూభాగం. ఈ ప్రాంతం భారత్‌కి అత్యంత వ్యూహాత్మక ప్రాంతం. ఈ పీఠభూమికి సమీపంలోనే అత్యంత కీలమైన ‘‘సిలిగురి కారిడార్(చికెన్ నెక్)’’ ఉంది. ఈ కారిడార్ ఈశాన్య భారతాన్ని, మిగిలిన దేశంతో కలుపుతోంది. భూటాన్ పశ్చిమ ప్రాంతంలోని డోక్లామ్ సమీపంలో ఉన్న ఈ గ్రామాలను చైనా తన సొంత గ్రామాలుగా చెప్పుకుంటోంది. వాటిలో చాలా వరకు సైనిక ఔట్‌పోస్టులు ఉన్నాయి. ఈ 22 గ్రామాల్లో అతిపెద్దది ‘‘జివు’’. ఇది పశ్చిమ సెక్టార్‌లోని త్షేతాంగ్‌ఖా అని పిలువబడే సాంప్రదాయ భూటాన్ పచ్చికభూమిపై నిర్మించబడిందని నివేదికలు తెలుపుతున్నాయి.
Read Also: Folk Singer Suicide: ఫోక్ సింగర్ ప్రాణం తీసిన సోషల్ మీడియా ప్రేమ
2017లో భారత్-చైనాల మధ్య డోక్లామ్ వివాదం ఏర్పడింది. రెండు దేశాల బలగాల మధ్య 73 రోజుల పాటు ప్రతిష్టంభన ఏర్పడింది. చైనా నిర్మిస్తున్న హైవేని, ఇతర మౌలిక సదుపాయాలను భారత్ అడ్డుకుంది. ‘‘ఫోర్స్‌ఫుల్ డిప్లమసీ’’ పేరుతో వెల్లడైన రిపోర్టులో చైనా భూటాన్‌కి చెందిన 2 శాతం భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ ప్రాంతంలోకి అధికారులు, నిర్మాణ కార్మికులు, సరిహద్దు పోలీసులు, సైనిక సిబ్బందిని తరలించింది.
చైనా నిర్మాణాలు భారత్‌కి ఆందోళన కలిగించేవే. చైనా చర్యలు భూటాన్‌తో 1998 ఒప్పందాన్ని ఉల్లంఘించాయని చైనాలో భారత మాజీ రాయబారి అశోక్ కాంత అన్నారు. చైనా చర్యలు సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, యథాతథ స్థితిని కొనసాగించడానికి భూటాన్‌తో 1998 ఒప్పందాన్ని ఉల్లంఘించాయని చెప్పారు. వాస్తవాలను క్రమంగా మార్చే పనిలో చైనా ఉందని అన్నారు.