NTV Telugu Site icon

49th Chief Justice of India : తన వారసుడి పేరును సిఫార్సు చేసిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. ఆయన ఎవరంటే..?

Justice Uu Lalit

Justice Uu Lalit

ప్రస్తుతం భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ నెలలోనే పదవీ విరమణ పొందనున్నారు.. అయితే, తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? అనే చర్చ సాగుతోన్న తరుణంలో… ఊహాగానాలకు తెరదించుతూ.. జస్టిస్ యూయూ లలిత్ పేరును సిఫార్సు చేశారు సీజేఐ ఎన్వీ రమణ.. దీంతో, 49వ భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు జస్టిస్ యూయూ లలిత్.. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి అయిన ఆయన.. పూర్తి పేరు ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌… తీవ్ర సంచలనం సృష్టించిన ట్రిపుల్‌ తలాక్‌ సహా అనేక కీలక అంశాల్లో తీర్పు వెలువరించిన ధర్మాసనాల్లో జస్టిస్‌ లలిత్‌ భాగస్వామిగా ఉన్నారు..

Read Also: MP Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో కాల్‌ లీక్…? ఇదే కుట్రే అంటున్న ఎంపీ..

ఇక, జస్టిస్ యూయూ లలిత్‌ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు.. 1971 జనవరిలో 13వ భారత ప్రధాన న్యాయమూర్తి అయిన జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రీ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అయిన మొదటి న్యాయవాది కాగా.. ఆయన తర్వాత బార్‌ అసోసియేషన్‌ నుంచి నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై అనంతరం సీజేఐ అయిన రెండో వ్యక్తిగా రికార్డుకెక్కనున్నారు.. ఈ నెల 26వ తేదీన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ చేయనుండగా.. ఈ నెల 27వ తేదీన సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు జస్టిస్ లలిత్.. ఆయన 9 నవంబర్‌ 1957న జన్మించారు.. జూన్‌ 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకోగా.. డిసెంబర్‌ 1985 వరకు బొంబాయి హైకోర్టులో ప్రాక్టీసు చేసి.. జనవరి 1986 నుంచి తన ప్రాక్టీసును సుప్రీంకోర్టుకు మార్చుకున్నారు.. ఇక, ఆగస్టు 13, 2014న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి అనేక కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు..

అయితే, తన వారసుడిగా జస్టిస్ యూయూ లలిత్ పేరును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గురువారం సిఫార్సు చేశారు. ఈరోజు ఉదయం జస్టిస్ లలిత్‌కు సిఫార్సు కాపీని అందజేశారు సీజేఐ ఎన్వీ రమణ… ఈ నెల 26న పదవీ విరమణ చేయనున్నందున తన వారసుడి పేరును సిఫారసు చేయాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు బుధవారం సీజేఐకి లేఖ రాశారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే, ఆయన 74 రోజుల స్వల్పకాలం సీజేఐగా కొనసాగనున్నారు.. నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు జస్టిస్‌ లలిత్.. ఆ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవుతారు.

Show comments