Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛాంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మత మార్పిడిలే లక్ష్యంగా ఈ ముఠా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు యూపీ పోలీసులు చెబుతున్నారు. ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే స్థాయి నుంచి ఇప్పుడు కోట్ల రూపాయల నిధులు సంపాదించాడు. ముఖ్యంగా 40 బ్యాంక్ అకౌంట్లలో రూ. 106 కోట్ల నిధులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఉత్తర్ ప్రదేశ్ బలరాంపూర్ జిల్లాలో ఇటీవల మతమార్పిడి రాకెట్ బయటపడింది. ఈ కేసులో శనివారం లక్నోలోని ఒక హోటల్‌లో చంగూర్ బాబాతో పాటు అతడి సన్నిహితురాలు నీతు అలియాస్ నస్రీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పేదలు, నిస్సహాయులైన కార్మికులు, బలహీన వర్గాలు, వితంతువులను ప్రోత్సాహకాలు, ఆర్థిక సహాయం, వివాహ హామీలతో, బెదిరింపులతో ఆకర్షించి నిందితులు మతమార్పిడి చేస్తున్నారు.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం..
యుపి ఉగ్రవాద నిరోధక దళం (ATS) ఈ ముఠాకు ఏదైనా ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా అని కూడా దర్యాప్తు చేస్తోంది. ఇతడికి వచ్చిన నిధులు ఎక్కువగా మిడిల్ఈస్ట్ దేశాలతో ముడిపడి ఉన్నాయి. యుపి స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) కూడా ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. బలరాంపూర్‌లోని ఈ ముఠాతో సంబంధం ఉన్న ఇతర వ్యక్తులను కూడా స్థానిక పోలీసులు విచారిస్తున్నారు. ఇతడి అక్రమ సంపాదనపై ఈడీ కూడా కేసు నమోదు చేసింది.
ఒకప్పుడు సైకిల్‌పై ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే చంగూర్ బాబా, ఇప్పుడు కోట్లకు అధిపతిగా మారాడు. రూ. 106 కోట్ల నిధులు ఉండటం అధికారుల్ని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా ఈ నిధులు మిడిల్ ఈస్ట్‌లోని ఇస్లామిక్ దేశాల నుంచి రావడం గమనార్హం. ఉత్తరప్రదేశ్‌లోని రెహ్రా మాఫీ గ్రామానికి చెందిన చంగూర్ బాబా సామ్రాజ్యం మొత్తం నేపాల్ సరిహద్దులో ఉన్న బలరాంపూర్ జిల్లాలోని ఉత్తరౌలా ప్రాంతంలో ఉంది.
చంగూర్ బాబా అరెస్ట్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతించారు. అతను ఒక నేరస్తుడని, మహిళ గౌరవంతో ఆడుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడి చర్యలు సామాజిక వ్యతిరేకత, జాతి వ్యతిరేకతను కలిగి ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు చెప్పారు.