Chhangur Baba: జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హిందూ యువతను ట్రాప్ చేసి, వారిని వివాహం చేసుకుని, ఇస్లాంలోకి మార్చాలనే పెద్ద నెట్‌వర్క్‌ను ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ మొత్తం కేసులో ప్రధాన సూత్రధారిగా ఛంగూర్ బాబా ఉన్నాడు. యూపీలోని నేపాల్ సరిహద్దుల్లో ఉండే బలరాంపూర్ జిల్లా మాధ్‌పూర్ కేంద్రంగా దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.
ఇస్లామిక్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ మతమార్పిడుల కోసం నిధులు వచ్చినట్లు తెలుస్తోంది. నేపాల్‌తో ముడిపడి ఉన్న నిధుల జాడను దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఛంగూర్ బాబా గత మూడేళ్లలో సుమారు రూ. 500 కోట్ల విదేశీ నిధులు అందుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. భద్రతా సంస్థలు ఇప్పటి వరకు రూ. 200 కోట్లను గుర్తించారు. మిగిలిన రూ. 300 కోట్ల నిధులు వివిధ జిల్లాల్లోని వివిధ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇస్లామిక్ దేశాల నుంచి నేపాల్ ద్వారా ఈ నిధుల్ని మళ్లించినట్లు ఆధారాలు ఉన్నాయి.
Read Also: Bangladesh: భారత్‌కు పక్కలో బళ్లెంలా బంగ్లాదేశ్, మరో దేశం నుంచి ఆయుధాల సేకరణ..
నివేదికల ప్రకారం, పాకిస్తాన్, దుబాయ్, సౌదీ అరేబియా, టర్కీ వంటి దేశాల నుంచి నిధులు సేకరించడానికి నేపాల్‌లోని నవల్పరాసి, రూపండేహి, బాంకే, ఖాట్మాండు జిల్లాల్లో 100కు పైగా బ్యాంక్ అకౌంట్స్ తెరిచారు. ఈ ఖాతాలను భారత్‌కు డబ్బు పంపడానికి ఉపయోగించారు. ఏజెంట్లు నేపాల్‌లో డబ్బును విత్ డ్రా చేసి, భారత్‌లోని ఛంగూర్ బాబా నెట్‌వర్క్‌కి అప్పగించే వారు. ఏజెంట్లు 4-5 శాతం కమీషన్లు తీసుకునే వారు. మధుబని, సీతామర్హి, పూర్నియా, కిషన్‌గంజ్, చంపారన్ వంటి బీహార్ జిల్లాల్లోని ఏజెంట్లు కూడా నేపాల్ నుండి భారతదేశానికి నిధులను తరలించడంలో సహాయపడ్డారని తెలుస్తోంది.
రాయ్ బరేలిలో ఇటీవల అరెస్టు చేయబడిన సైబర్ నేరస్థులు కూడా అదే అక్రమ మార్పిడి నెట్‌వర్క్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు తేలింది. ఈ నెట్‌వర్క్ ద్వారా లక్నో, బలరాంపూర్, గోండా మరియు అయోధ్యతో సహా అనేక నగరాలకు కోట్లాది రూపాయలు మళ్లించబడ్డాయి. మార్పిడి కార్యకలాపాలు, సంబంధిత కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి అయోధ్యలో అత్యధిక మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. గత 15 ఏళ్లుగా చట్టవిరుద్ధమైన మత మార్పిడులకు పాల్పడున్న ఆరోపణల కింద ఛంగూర్ బాబాను అరెస్ట్ చేశారు. ఈ కేసును యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS)తో సహా, ఎన్ఐఏ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి.