Site icon NTV Telugu

Chenab river: పాకిస్తాన్‌‌ని చావు దెబ్బతీసిన భారత్.. “చీనాబ్” నదీ నీటి మళ్లింపు..

Chenab River

Chenab River

Chenab river: పాకిస్తాన్‌ని చావు దెబ్బతీసింది భారత్. అప్పుడెప్పుడో నెహ్రూ హాయాంలో  పాక్ అధినేత అయూబ్ ఖాన్‌తో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో సింధూ నదీ జలాల ఒప్పందం జరిగింది. అయితే, పలు సందర్భాల్లో భారత్‌ను దెబ్బకొట్టేందుకు సీమాంతర ఉగ్రవాదాన్ని, ఉగ్రదాడుల్ని చేస్తున్నా.. ఈ ఒప్పందం జోలికి మాత్రం భారత్ ఏనాడు వెళ్లలేదు. అయితే, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాకిస్తాన్‌కి ఎక్కడ కొడితే దెబ్బ గట్టిగా తగులుతుందో చూసి ఇండియా దెబ్బ కొడుతోంది. తాజాగా మరోసారి అలాంటి దెబ్బనే తీసింది.

పాకిస్తాన్ గత కొన్ని దశాబ్ధాలుగా ఎలాంటి చింత లేకుండా సింధూ నదీ, దాని ఉపనదులు జలాలను దర్జాగా వాడుకుంటోంది. అయితే, తాజాగా సింధూ ఉపనదుల్లో ఒకటైన ‘చీనాబ్ నది’ నీటిని భారత్ విజయవంతంగా మళ్లించింది. జమ్మూ కాశ్మీర్‌లోని 850 మెగావాట్ల రాటిల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును వేగవంతం చేసేందుకు కిష్త్వార్ జిల్లాలోని ద్రాబ్‌షల్లా వద్ద సొరంగాల ద్వారా చీనాబ్ నది నీటిని మళ్లించినట్లు ప్రభుత్వం గత సోమవారం ప్రకటించింది. నదీ ప్రవాహాన్ని మళ్లించడం ద్వారా ఆనకట్ట నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. రాటిల్ ప్రాజెక్ట్‌ను 51:49 శాతం వాటాతో నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC) లిమిటెడ్, జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉమ్మడి ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్‌కి నీటిని ఆపడమే కాకుండా పరోక్షంగా, ప్రత్యక్షంగా 4000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 40 ఏళ్ల పాటు రూ. 5289 కోట్ల ఉచిత విద్యుత్‌ని పొందొచ్చు.

Read Also: PM Modi: గత పాలకులు రాజకీయ ప్రయోజనాల కోసం దేశ చరిత్రను నిర్లక్ష్యం చేశారు..

ఇండస్ వాటర్ ట్రిటీ..

సింధూ నదీ జలాలపై 1960లో అప్పటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంలో ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారత్‌కి తూర్పు నదులు బియాస్, రావి, సట్లేజ్‌లు, పాకిస్తాన్‌కి సింధు, చీనాబ్, జీలం నదులపై నియంత్రణ ఉంటుంది.

పలు సందర్భాల్లో ఈ ఒప్పందం వివాదాస్పదమైంది. ఈ ఒప్పందం వల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనే వాదన కూడా ఉంది. 2016 ఉరీ ఉగ్రదాడి తర్వాత భారత ప్రధాని నరేంద్రమోడీ.. ‘‘రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు’’ అని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్‌కి తెలియజేసింది. అయితే, పాక్ మాత్రం పాత ఇండస్ వాటర్ ట్రిటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరికను వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ఒప్పందం అమలు లేదు. దీంతో పాక్ నోరు మెదపలేని పరిస్థితిలో ఉంది.

Exit mobile version