NTV Telugu Site icon

Chandigarh Mayor Row: సుప్రీంకోర్టు విచారణకు ముందే చండీగఢ్ మేయర్ రాజీనామా..

Chandigarh Mayor

Chandigarh Mayor

Chandigarh Mayor Row: చండీగఢ్ మేయర్ పోల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆప్ కలిసి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాని ప్రయత్నించింది. అయితే, అనూహ్య పరిణామాల మధ్య బీజేపీ అభ్యర్థి చండీగఢ్ మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈ వివాదం సుప్రీంకోర్టుకి ఎక్కింది. ఈ రోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, విచారణకు ముందే మేయర్ అభ్యర్థి, బీజేపీ నేత మనోజ్ సోంకర్ ఆదివారం రాజీనామా చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కుల్దీప్ కుమార్‌ను ఓడించడం ద్వారా ఇండియా కూటమికి వ్యతిరేకంగా సోంకర్ గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 16 ఓట్లు రాగా.. కాంగ్రెస్-ఆప్ ఉమ్మడి అభ్యర్థి కుల్దీప్ సింగ్‌కి 12 ఓట్లు వచ్చాయి. అయితే, 8 ఓట్లు చెల్లనవిగా ప్రకటించడంతో రచ్చ మొదలైంది. ఇదిలా ఉంటే, ఆప్‌కి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు పూనమ్ దేవి, నేహా, గుర్చరణ్ కాలా ఆదివారం బీజేపీలో చేరడంతో ఈ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారాయి.

Read Also: Glod Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?

35 సభ్యుల ఉన్న చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే, ఆ తర్వాత పలువరు బీజేపీలో చేరడంతో 17కి చేరింది. శిరోమణి అకాళీదళ్ నుంచి ఒక అభ్యర్థి బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. చండీగఢ్ ఎంపీ, బీజేపీకి చెందిన కిర్రోన్ ఖేర్‌కి ఎక్స్-అఫిషియోగా ఓటు హక్కు ఉంది. దీంతో బీజేపి మ్యాజిక్ ఫిగర్ 19గా ఉంది.

జనవరి 30న ఫలితాలు వెలువడిన వెంటనే, కాంగ్రెస్ మరియు ఆప్ కౌన్సిలర్లు బిజెపి మోసం చేసిందని, ఎన్నికల ప్రక్రియను అనుసరించడం లేదని ఆరోపించడంతో సభలో గందరగోళం చెలరేగింది. ప్రిసైడింగ్ అధికారి అనిల్ మసీహ్ బ్యాలెట్ పేపర్లను ట్యాంపరింగ్ చేస్తూ పట్టుబడ్డారని సుప్రీంకోర్టులో పిటిషన్ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోని కోర్టుకు సమర్పించారు. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. ఈ కేసుపై విచారణ జరుగుతున్న క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.