NTV Telugu Site icon

Champai Soren: ఈ నెల 30న బీజేపీలోకి ఝార్ఖండ్ మాజీ సీఎం..

Champai

Champai

Champai Soren: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ బీజేపీలో చేరిక ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఎక్స్ (ట్వీటర్) వేదికగా సోమవారం అర్ధరాత్రి ఒక పోస్ట్ చేశారు. ఈ నెల 30వ తేదీన (శుక్రవారం) కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో చంపై సోరెన్ కాషాయ కండువా కప్పుకుంటారని పేర్కొన్నారు. ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ తిరిగి బాధ్యతలు స్వీకరించాక చంపైకి జేఎంఎం పార్టీలో ప్రాధాన్యత తగ్గిపోయింది. దీంతో సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ఇటీవలే ప్రకటించిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అనూహ్యంగా తన నిర్ణయం మార్చుకుని.. ఈ క్రమంలో బీజేపీలో చేరనుండడం ఆసక్తికరంగా మారింది.

Read Also: Off The Record : రాష్ట్ర నేతలకు బీజేపీ ఇంచార్జి వైఖరి రుచించడం లేదా..?

అయితే, నిన్న (సోమవారం) రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో సమావేశం తర్వాత బీజేపీలో చేరాలని ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ నిర్ణయించుకున్నారని అసోం సీఎం తెలిపారు. కాగా, గత ఫిబ్రవరిలో ల్యాండ్ స్కామ్ కేసులో అరెస్టైన హేమంత్ సోరెన్.. 6 నెలల పాటు జైలుకు వెళ్లే ముందు తన సీఎం పదవికి రాజీనామా చేసి చంపై సోరెన్ కు ఆ బాధ్యతలను అప్పగించారు.. కాగా, 6 నెలలు జైలు శిక్ష అనుభవించిన తర్వాత ఝార్ఖండ్ హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ సీఎం పగ్గాలు చేపట్టడంతో.. తీవ్ర మనోవేదనకు గురైనా చంపై సోరెన్.. అప్పటి నుంచి జేఎంఎం పార్టీతో అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది.