Madhya Pradesh High Court: ముస్లిం పురుషుడు, హిందూ మహిళ మధ్య వివాహం అనేది ప్రత్యేక వివాహ చట్టం కింద నమోదు చేసినప్పటికీ, ముస్లిం వ్యక్తిగత వివాహ చట్టం ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును చెప్పింది. మతాంతర జంటకు పోలీసు రక్షణను నిరాకరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. విగ్రహారాధన చేసే యువతితో, ముస్లిం పురుషుడు వివాహం చేసుకోవడాన్ని ముస్లిం చట్టం అంగీకరించదని, పోలీస్ రక్షణ కోరుతూ దంపతులు దాఖలు చేసిన పిటిషన్‌ని విచారించిన సందర్భం జస్టిస్ జీఎస్ అహ్లువాలియా అన్నారు.
సఫీ ఖాన్(23), సారికా సేన్(23)లు తాము మతం, విశ్వాసంతో సంబంధం లేకుండా ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నామని కోర్టుకు వెల్లడించారు. అయితే వారి కుటుంబ సభ్యుల బెదిరింపుల కారణంగా వివాహం చేసుకోలేకపోయామని సఫీ ఖాన్ మరియు సారిక సేన్ కోర్టుకు తెలిపారు.తాము వివాహం చేసుకోవడానికి రిజిస్టార్ ముందు సురక్షితంగా హాజరుకావడానికి తమకు సెక్యూరిటీ కల్పించాలని కోర్టును కోరారు.
తాము మతం మారబోమని, ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం, వ్యక్తిగత చట్టంలోని పరిమితులను అధిగమిస్తుందని నొక్కి చెప్పారు. సారిక హిందువు, తాను ముస్లింగా సురక్షితంగా ఉంటామని, ఒకరి మతపరమైన ఆచార వ్యవహారాల్లో మరొకరం జోక్యం చేసుకోమని చెప్పారు. అయితే, వారి పిటిషన్‌ని యువతి కుటుంబం వ్యతిరేకించింది. తమ వద్ద ఉన్న ఆభరణాలు, నగదుతో పారిపోయిందని, మతాంతర వివాహం తమను సామాజిక బహిష్కరణకు దారి తీస్తుందని ఆరోపించింది.
ఇరువైపులా విన్న తర్వాత, సంబంధిత పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత, ముస్లిం పురుషుడు మరియు విగ్రహారాధన చేసే స్త్రీ మధ్య వివాహం చెల్లుబాటు కానప్పటికీ అది సక్రమంగా పరిగణించబడుతుందని కోర్టు పేర్కొంది.‘‘ మహమ్మదీయ చట్టం ప్రకారం, విగ్రహారాధకురాలు లేదా అగ్ని ఆరాధకురాలు అయిన అమ్మాయితో ముస్లిం అబ్బాయి వివాహం చెల్లుబాటు కాదు. ప్రత్యేక వివాహ చట్టం కింద వివాహం నమోదు చేసినప్పటికీ, వివాహం చెల్లదు. వివాహం మరియు అది క్రమరహిత (ఫసిద్) వివాహం అవుతుంది’’ అని జస్టిస్ అహ్లువాలియా అన్నారు.
ముస్లిం చట్టంలో చెల్లుబాటు అయ్యే (సాహిహ్), మరియు అక్రమమైన (ఫసీద్) వివాహాల మధ్య వ్యత్యాసాన్ని కూడా కోర్టు హైలైట్ చేసింది, మొహమ్మద్ సలీం వర్సెస్ శంసుదీన్ వంటి కేసుల్లో సుప్రీం కోర్టు వివరణలను ప్రస్తావించింది హైకోర్టు. ఈ జంటకు పోలీస్ రక్షణ లేదా ఇతర ఉపశమనాలను కల్పించేందుకు ఎటువంటి ఆధారాలు లేవని పిటిషన్‌ని కొట్టేసింది.