NTV Telugu Site icon

Manipur: మణిపూర్‌లో హింస.. నేడు ఢిల్లీలో మైతీ-కుకి, నాగా నేతలతో కేంద్రం కీలక చర్చలు..

Manipur

Manipur

Manipur: మణిపూర్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న జాతి వివాదానికి పరిష్కారం కనుగొని శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు (మంగళవారం) న్యూ ఢిల్లీలో మైతీ, కుకీ మరియు నాగా కమ్యూనిటీలకు చెందిన ఎమ్మెల్యేల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ఏడాది కాలంగా కొనసాగుతున్న హింసాకాండకు స్వస్తి పలికేందుకు తొలిసారిగా ఈ మీటింగ్ కు పిలుపునిచ్చారు. కాగా, దేశ రాజధానిలో జరగనున్న ఈ సమావేశానికి ముగ్గురు నాగా ఎమ్మెల్యేలు అవాంగ్‌బౌ న్యూమై, ఎల్. డికో, రామ్ ముయివా హాజరవుతారని అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అధికార బీజేపీకి మిత్రపక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (NPF) సభ్యులు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

అయితే, మైతీ, కుకీ వర్గాలకు చెందిన ఎంత మంది ఎమ్మెల్యేలు దీనికి హాజరవుతారనేది ఇంకా స్పష్టంగా తెలపలేదు. వివాదంలో ఉన్న వర్గాల మధ్య చర్చలు ప్రారంభించి సంక్షోభానికి పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ చర్చలు కొనసాగనుంది. ఈ చర్చలకు హాజరయ్యే నాగా, కుకీ, మైతీ ఎమ్మెల్యేలందరినీ హోం మంత్రిత్వ శాఖ వ్యక్తిగతంగా ఆహ్వానించినట్లు ఇంఫాల్‌లోని స్థానిక మీడియా తెలిపింది. ఇప్పటికే కొంతమంది మైతీ ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ సభ్యులు కూడా న్యూఢిల్లీకి బయలుదేరారని పేర్కొనింది.

Read Also: Karunakaran : ఇన్నాళ్లకు ఓ అవకాశాన్ని దక్కించుకున్న తొలిప్రేమ దర్శకుడు

హింసలో ఇప్పటి వరకు 200 మంది చనిపోయారు
2023 మేలో మణిపూర్‌లో చెలరేగిన జాతి వివాదంలో ఇప్పటి వరకు 200 మందికి పైగా చనిపోయారు. అలాగే, అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలతో సంయుక్త ఆపరేషన్‌లో సైన్యం మణిపూర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు సోమవారం అధికారులు సమాచారం అందించారు. దీంతో పాటు అక్టోబర్ 7న బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన సంయుక్త ఆపరేషన్‌లో ఒక కార్బైన్ మెషీన్, ఒక ఏకే-47 రైఫిల్, 12 బోర్ సింగిల్ బ్యారెల్ రైఫిల్, 12 బోర్ పిస్టల్, 2.5 కిలోల ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం (ఐఈడీ), మందుగుండు సామాగ్రి, గ్రెనేడ్‌లు, యుద్ధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.