Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..

Acid Attack Victims

Acid Attack Victims

Acid Attack Victims: దేశవ్యాప్తంగా యాసిడ్ దాడి బాధితులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఇప్పటి వరకు బాహ్య గాయాలు కనిపించే బాధితులకు మాత్రమే ప్రధానంగా దివ్యాంగుల హక్కుల చట్టం-2016 కింద ప్రయోజనాలు అందుతున్న నేపథ్యంలో, ఇకపై బాహ్య గాయాలు లేకపోయినా అంతర్గత అవయవాలు దెబ్బతిన్న యాసిడ్ దాడి బాధితులకు కూడా అదే చట్టంలోని అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు దివ్యాంగుల హక్కుల చట్టం-2016లో అవసరమైన సవరణలను ఈ ఏడాది మే నెలలోనే నోటిఫై చేసినట్లు కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగానే ఈ మార్పులు చేపట్టినట్లు కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఈ సవరణతో అంతర్గత గాయాల కారణంగా తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న యాసిడ్ దాడి బాధితులు పరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైద్య సహాయం, ఉపాధి అవకాశాలు, ఇతర చట్టపరమైన రాయితీలు వంటి పలు ప్రయోజనాలను పొందే అవకాశం కలగనుంది. యాసిడ్ దాడి బాధితుల పునరావాసం, సంక్షేమానికి ఈ నిర్ణయం కీలక అడుగుగా భావిస్తున్నారు.

మొత్తంగా యాసిడ్ దాడి బాధితులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం అమల్లోకి వచ్చింది. బాహ్యంగా గాయాలు లేదా ముఖవికృతి కనిపించకపోయినా, యాసిడ్ దాడి వల్ల అంతర్గత అవయవాలు దెబ్బతిన్న బాధితులకు కూడా ఇకపై దివ్యాంగుల హక్కుల చట్టం-2016 (Rights of Persons with Disabilities Act, 2016) కింద అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు చట్టంలోని షెడ్యూల్‌ను సవరిస్తూ 2026 మే 22న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపింది. ఈ అంశాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం విచారించింది. యాసిడ్ దాడి బాధితురాలు షహీన్ మాలిక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) విచారణ సందర్భంగా కేంద్రం ఈ వివరాలను కోర్టుకు సమర్పించింది.

ఈ ఏడాది మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పులో, బాహ్య గాయాలు లేకపోయినా అంతర్గత గాయాలతో బాధపడుతున్న యాసిడ్ దాడి బాధితులను కూడా చట్ట పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. అధికారిక సవరణ జరిగే వరకు కూడా అలాంటి బాధితులకు చట్టంలోని అన్ని హక్కులు వర్తిస్తాయని పేర్కొంది. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టంలో స్పష్టత తీసుకొచ్చేలా సవరణను నోటిఫై చేసింది. కోర్టు మరో కీలక వ్యాఖ్య కూడా చేసింది. ఈ సవరణ కేవలం వివరణాత్మకమైనదే (Clarificatory) కావడంతో, దివ్యాంగుల హక్కుల చట్టం-2016 అమల్లోకి వచ్చిన నాటి నుంచే ఇది అమలులో ఉన్నట్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది. దీంతో అంతర్గత గాయాలున్న యాసిడ్ దాడి బాధితులు కూడా పరిహారం, పునరావాసం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వైద్య సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, ఇతర చట్టపరమైన రాయితీలు పొందే అవకాశం కలిగింది. విచారణ సందర్భంగా యాసిడ్ దాడులపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యాసిడ్ దాడులకు పాల్పడిన నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి కఠిన చర్యలను పరిశీలించాలని, అలాగే నిబంధనలు ఉల్లంఘించి యాసిడ్ విక్రయించే దుకాణదారులపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గత విచారణల్లో సూచించిన విషయం తెలిసిందే. ఈ తాజా సవరణతో యాసిడ్ దాడి బాధితుల హక్కుల పరిరక్షణలో మరో కీలక ముందడుగు పడినట్టు అయ్యింది..