దేశంలో కరోనా వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ (బీఈ) కరోనా వ్యాక్సిన్ కోసం భారీ ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం మూడో క్లినికల్ ట్రయల్స్ లో ఉన్న ఈ టీకా కోసం 1500 కోట్ల రూపాయల మేర ముందస్తు డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా బయోలాజికల్ ఈ వ్యాక్సిన్ ఆగస్ట్ – డిసెంబర్ మధ్య 30 కోట్ల డోసులను కంపెనీ ఉత్పత్తి చేయనుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. కోవాగ్జిన్ తర్వాత దేశంలో అందుబాటులోకి రానున్న రెండో మేడిన్ ఇండియా వ్యాక్సిన్ ఇదేనని పేర్కొంది. ఒకటి, రెండు దశల ప్రయోగాల్లో మంచి ఫలితాలను చూపించిన తర్వాత బయోలాజికల్ -ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ లో ఉందని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది.