Central Minister Kishan Reddy: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని రామగుండంలో ఉన్న జలాశయంలోని 600 ఎకరాలలో ఎన్టీపీసీ నిర్మించిన ఇటువంటి అతి పెద్ద ప్రాజెక్టు తెలంగాణలోనే ఉండటం అందరికీ చాలా గర్వకారణమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. “40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఈ ప్రాజెక్టులో వాడిన మొత్తం 4.5 లక్షల సోలార్ ఫొటో వోల్టాయిక్ ప్యానెల్‌లను మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం క్రింద దేశంలోనే తయారు చేయడం జరిగింది. పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టు వల్ల సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుందని అంచనా. 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నిరోధించవచ్చు. ఈ ప్రాజెక్టు వలన పెద్దమొత్తంలో ఆవిరి రూపంలో వెళ్లే నీటి వృథా అడ్డుకోవచ్చు. 31 వేల ఇళ్లకు అవసరమైన విద్యుత్‌ను ఈ ప్రాజెక్టు ద్వారా అందించవచ్చు. ఇంకా మనం గమనిస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుండి ఇప్పటివరకు గత 8 సంవత్సరాలుగా విద్యుత్ రంగంలో ఎన్నో అద్భుత విజయాలను సాధించింది. 2014లో, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2,48,554 మెగావాట్ల నుంచి నేడు 4,00,000 మెగావాట్లకు చేరింది. ఇది మన డిమాండ్ కంటే 1,85,000 మెగావాట్లు ఎక్కువ.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
“భారత్ ఇప్పుడు తన పొరుగు దేశాలకు విద్యుత్‌ను ఎగుమతి చేస్తోంది. 1,63,000 కి.మీ ట్రాన్స్‌మిషన్ లైన్‌లు కొత్తగా వేశారు. మొత్తం దేశాన్ని లడఖ్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుండి మయన్మార్ సరిహద్దు వరకుఒకే గ్రిడ్ గా ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రిడ్, ఈ గ్రిడ్‌ని ఉపయోగించి మనం దేశంలోని మూలమూలకు 1,12,000 మెగావాట్ల విద్యుత్‌ను ప్రసారం చేయవచ్చు. 2030 నాటికి మన విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 40% పునరుత్పాదక ఇంధన వనరుల నుండి సమకూర్చు కోవాలని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. మనం ఈ లక్ష్యాన్ని నవంబర్ 2021 నాటికి, షెడ్యూల్ కంటే 9 సంవత్సరాల ముందుగానే సాధించాము. ఈ రోజు మనం పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా 1,63,000 మెగావాట్ల మేర విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాము. మన దేశంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం.” అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.
PM Narendra Modi: నీటిలో తేలియాడే సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ
రూ.2,01,722 కోట్ల వ్యయంతో కేంద్రం గత ఐదేళ్లలో పంపిణీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. 2,921 కొత్త సబ్ స్టేషన్లు, 3,926 సబ్ స్టేషన్ల విస్తరణ , 6,04,465 km LT లైన్లను ఏర్పాటు చేయడం, 2,68,838 పైగా కేవీ విద్యుత్ లైన్లు, 1,22,123 కిమీ వ్యవసాయ ఫీడర్ల స్థాపన చేయడం జరిగిందన్నారు. 2015లో గ్రామీణ ప్రాంతాల్లో సరాసరి గంటలు 12.5 గంటలు ఉండగా.. ఇప్పుడు సగటున 22.5 గంటలకు పెరిగిందన్నారు. దేశంలోని కొన్ని అతి దూర ప్రాంతాలలోని గ్రామాల 2.86 కోట్ల ఇండ్లకు వ్యక్తిగత విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగిందన్నారు. 2018లో 987 రోజులలో విద్యుత్ అందుబాటులో లేని 18,374 గ్రామాలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యవేక్షణలో 100 శాతం గ్రామ విద్యుదీకరణ ప్రారంభించడం జరిగిందన్నారు. సోలార్ పంపుల దత్తత కోసం ప్రవేశపెట్టిన పథకంలో కేంద్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ ఇస్తుందని.. రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం సబ్సిడీ ఇస్తుందన్నారు. అదనంగా, 30శాతం రుణ సౌకర్యం అందుబాటులో ఉంటుందన్నారు.