Kolkata Rape-Murder Case: కోల్‌కతా వైద్యురాలి ఘటన యావత్ దేశాన్ని షాక్‌కి గురిచేసింది. నగరంలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలోని ఆస్పత్రిలో నైట్ డ్యూటీ చేస్తున్న 31 ఏళ్ల వైద్యురాలిపై అత్యంత దారుణంగా అత్యాచారం-హత్య జరిగింది. ఈ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా డాక్టర్లు, సాధారణ ప్రజలు ఆందోళన నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అక్కడి పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. ఈ కేసులో ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించడంతో కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కలకత్తా హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
ఇదిలా ఉంటే దేశంలో సంచలనంగా నిలిచిన ఉన్నావ్, హత్రాస్ అత్యాచార ఘటనల్ని దర్యాప్తు చేసిన ఇద్దరు సీనియర్ సీబీఐ అధికారులకు కోల్‌కతా డాక్టర్ కేసును అప్పగించారు. ఇంతకుముందు సంచలనాత్మ కేసుల్లో దర్యాప్తు చేసి విజయం సాధించిన వీరిద్దరు ఇప్పుడు కోల్‌కతా కేసుని డీల్ చేయబోతున్నారు. జార్ఖండ్‌కు చెందిన 1994 బ్యాచ్ IPS అధికారి అయిన సంపత్ మీనా హత్రాస్ రేప్-మర్డర్ కేసు మరియు ఉన్నావ్ రేప్ కేసులను దర్యాప్తు చేశారు. ఆమెతో పాటు హత్రాస్ దర్యాప్తు బృందంలో భాగమైన అధికారి సీమా పహుజా కూడా కోల్‌కతా కేసులో ఇన్వాల్వ్ అయ్యారు.
Read Also: Rajasthan: ఉదయ్‌పూర్ మత ఘర్షణలకు కారణమైన ఘటనలో బాలుడు మృతి..
అదనపు డైరెక్టర్‌గా మీనా మొత్తం 25 మంది అధికారుల బృందానికి బాధ్యత వహిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసులో మరో అధికారిణి పహుజా గ్రౌండ్ లెవల్‌లో విచారణ జరిపి తీర్పు వచ్చేలా చేశారు. 2017లో గుడియా కేసు హిమాచల్ ప్రదేశ్‌ని కుదిపేసింది. ఈ కేసులో దట్టమైన అటవీ మార్గంలో బాలికను అపహరించి, అత్యాచారం చేసి చంపేశారు. ఈ కేసులో అనిల్ కుమార్ అనే వ్యక్తి దోషిగా తేలడంతో అతడికి జీవిత ఖైదు విధించబడింది.
2017లో ఉన్నావ్ రేప్ కేసులో 17 ఏళ్ల దళిత బాలికపై సామూహిక అత్యాచారం కేసులో బీజేపీ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కి జీవిత ఖైదు విధించబడింది. దోషిగా తేలడంతో పార్టీ అతడిని సస్పెండ్చేసింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న బాలిక తండ్రి మరణానికి కూడా అతను దోషిగా తేలింది, దీనికి అతను 10 సంవత్సరాల జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.
2020 హత్రాస్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. 19 ఏళ్ల బాలికపై అగ్ర కులానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తీవ్రగాయాలతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఈ కేసులో నలుగురు నిందితుల్లో ముగ్గురు విడుదలయ్యారు. నాల్గవ వ్యక్తి, సందీప్ ఠాకూర్ దోషిగా నిర్ధారించబడ్డాడు.
