NTV Telugu Site icon

Kolkata doctor case: వైద్యురాలి హత్యాచార కేసులో సీబీఐ అప్‌డేట్ ఇదే!

Cbi

Cbi

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెపై గ్యాంగ్‌రేప్ జరిగినట్లుగా.. పోస్టుమార్టం రిపోర్టులో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ అవాస్తవాలంటూ సీబీఐ వర్గాలు కొట్టిపారేసినట్లుగా తెలుస్తోంది. నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా దర్యాప్తు బృందాలు తేల్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. విచారణ ఒక కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దర్యాప్తు సమాచారాన్ని కోర్టులో సబ్మిట్ చేయనున్నట్లు సమాచారం.

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు అత్యంత క్రూరంగా హత్యాచారానికి గురైంది. శరీరమంతా గాయాలు, కళ్లు, ప్రైవేటు భాగాల నుంచి విపరీతంగా రక్తస్రావం జరిగింది. దీంతో ఆమెపై సామూహిక అత్యాచారం జరినట్లుగా అనుమానాలు రేకెత్తించాయి. ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం మమత మాట్లాడుతూ.. వారంలోగా పోలీసులు కేసును తేల్చకపోతే.. సీబీఐకి అప్పగిస్తానని ప్రకటించారు. కానీ ఆందోళనలు ఉధృతం కావడంతో కోల్‌కతా హైకోర్టు స్పందించి.. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు.. నిందితుడు సంజయ్ రాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ఇతడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని తేల్చారు. అంతేకాకుండా అతడి మొబైల్‌లో అశ్లీల వీడియోలు, ఫొటోలు కనిపించాయి. దీంతో అతడి ప్రవర్తనపై అనుమానాలు రేకెత్తాయి. సంజయ్‌కి పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా నిర్వహించారు. నేరం జరిగిన ప్రదేశంలో నిందితుడు ఉన్నాడని చెప్పడానికి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలున్నాయి. ఆగస్టు 8 ఉదయం 11 గంటలకు శ్వాసకోశ విభాగం సమీపంలో రాయ్‌ కనిపించాడు. ఆగస్టు 9 తెల్లవారుజామున 4 గంటలకు మళ్లీ అదే బిల్డింగులోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయ్యిందని కేసు దర్యాప్తులో పాల్గొన్న ఓ సీబీఐ అధికారి గతంలో వెల్లడించారు. ఇక మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. మొత్తానికి దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. త్వరలో న్యాయస్థానంలో అభియోగాలను అధికారులు నమోదు చేయనున్నారు.

వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని అధికారులు భావిస్తున్నారు. అయితే అంత దారుణంగా ఎలా చనిపోయింది? అనేది అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆమె తీవ్రంగా ప్రతిఘటించినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తు్న్నాయి. ప్రక్కనే పేషెంట్ల వార్డు కూడా ఉంది. అర్ధరాత్రి నిశ్శబ్దంగా ఉన్న సమయంలో ఎవరికీ ఎలాంటి శబ్ధాలు వినిపించలేదా? అన్నది అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సుప్రీంకోర్టు సమోటోగా స్వీకరించి దర్యాప్తు చేస్తోంది. చివరిగా న్యాయస్థానం ఏం తేలుస్తుందో చూడాలి.