Site icon NTV Telugu

Sonam Wangchuk: చిక్కుల్లో సోనమ్ వాంగ్‌చుక్.. ఎఫ్‌సీఆర్ఏ ఉల్లంఘనలపై సీబీఐ దర్యాప్తు

Activist Sonam Wangchuk

Activist Sonam Wangchuk

లడఖ్ అల్లర్ల నేపథ్యంలో వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చిక్కుల్లో పడ్డారు. గత కొద్ది రోజులుగా లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యల నేపథ్యంలో లడఖ్‌లో బుధవారం పెద్ద ఎత్తున హింస చెలరేగింది. బీజేపీ కార్యాలయం సహా పలు కార్యాలయాలను ధ్వంసం చేసి తగలబెట్టారు. అంతేకాకుండా పోలీస్ వాహనాలను కూడా తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంస చేశారు. అయితే ఈ హింసకు సోనమ్ వాంగ్‌చుక్‌నే కారణంగా కేంద్రం భావిస్తోంది. మరోవైపు దీని వెనుక కాంగ్రెస్ హస్తం కూడా ఉందని బీజేపీ ఆరోపించింది.

ఇది కూడా చదవండి: Devendra Fadnavis: బీజేపీ అధ్యక్షుడు ఎంపికపై ఫడ్నవిస్ కీలక వ్యాఖ్యలు

సోనమ్ వాంగ్‌చుక్ ఎన్జీవో హిమాలయన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ లెర్నింగ్‌‌పై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. విదేశీ కాంట్రిబ్యూషన్ (నియంత్రణ) చట్టం ఉల్లంఘించిందా? అన్న దానిపై విచారణ చేపట్టింది. అయితే ఎన్జీవో ఎఫ్‌సీఆర్‌ఏ ఉల్లంఘనలకు పాల్పడినట్లుగా కేంద్రం అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. అయితే ప్రస్తుతం దర్యాప్తు సంస్థ ఎఫ్‌ఐఆర్ బుక్ చేయలేదు గానీ.. విచారణ మాత్రం ప్రారంభించింది. దర్యాప్తులో ఆధారాలు దొరికితే మాత్రం కేసు బుక్ చేసేందుకు సిద్ధపడుతోంది.

ఇది కూడా చదవండి: Modi-Trump: త్వరలో మోడీ-ట్రంప్ భేటీ.. అమెరికా వర్గాలు సంకేతాలు

భారత్‌లో ఇప్పటిదాకా ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ బుధవారం హఠాత్తుగా లడఖ్‌లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. రాష్ట్ర హోదా పేరుతో నిరసనకారులు రోడ్లపైకి నానా బీభత్సం సృష్టించారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి.. వాహనాలు తగలబెట్టారు. అంతటితో ఆగకుండా బీజేపీ కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలపై దాడి చేసి తగలబెట్టారు. దీంతో నేపాల్‌లో మాదిరిగా జెన్-జెడ్ తరహాలో హింస చెలరేగింది. ఒక్కసారిగా కేంద్రం అప్రమత్తం అయింది. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా బుధవారం కేంద్ర భూభాగంలోని లేహ్ జిల్లా అంతటా కర్ఫ్యూ విధించారు. దీంతో భారీగా భద్రతా దళాలు మోహరింపు హింస చెలరేగకుండా ఆపగలిగారు.

ఇదిలా ఉంటే గత రెండు వారాలుగా వాతావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ నిరసన దీక్ష చేస్తున్నాడు. లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే సోనమ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లుగా కేంద్రం గుర్తించింది. కొన్ని గుంపులను హింస ప్రేరేపించినట్లుగా అనుమానిస్తోంది. లడఖ్‌కు రాష్ట్ర హోదా కోసం అరబ్ స్ప్రింగ్ తరహా ఉద్యమాన్ని కోరుకుంటున్నట్లు సోనమ్ ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా నేపాల్‌లో జరిగిన జెన్-జెడ్ ఉద్యమాన్ని కూడా పదే పదే ప్రస్తావించడంతో బుధవారం హఠాత్తుగా హింస చెలరేగినట్లుగా కేంద్రం భావిస్తోంది. సోనమ్.. అరబ్ స్ప్రింగ్ తరహా నిరసన, నేపాల్‌లో జనరల్ జెడ్ నిరసనల తరహా రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ప్రజలను తప్పుదారి పట్టించాడని హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇక బుధవారం జరిగిన హింసలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 70 మంది గాయపడ్డారు. లడఖ్‌లో పరిస్థితి దానంతట అదే అదుపు తప్పలేదని.. ఉద్దేశపూర్వకంగా దీనిని సృష్టించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టడం వల్లే ఇదంతా జరిగిందని పేర్కొంది. సోనమ్ వాంగ్‌చుక్ వ్యక్తిగత ఆశయాలకు లడఖ్, యువ జనాభా భారీ మూల్యం చెల్లిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. కుట్రలో చిక్కుకున్నందుకు వారిని నిందించలేమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. లడఖ్ ప్రజల సంక్షేమం, సాధికారతకు కేంద్రం కట్టుబడి ఉందని కూడా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 

Exit mobile version