Site icon NTV Telugu

Satya Pal Malik: జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌‌‌కు సీబీఐ షాక్..

Satya Pal Malik

Satya Pal Malik

Satya Pal Malik: సుమారు రూ. 2200 కోట్ల విలువైన కిరు జల విద్యుత్ ప్రాజెక్టు సివిల్ వర్క్స్ కాంట్రాక్టుల మంజూరుకు సంబంధించి అవినీతి కేసులో జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కి ఉచ్చు బిగిస్తోంది. సీబీఐ ఆయనపై గురువారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. కిష్ట్వార్‌లో కిరు జల విద్యుత్ ప్రాజెక్టు టెంటర్ల ప్రక్రియకలో జరిగిన అనుమానిత అక్రమాలకు సంబంధించిన కేసులో ఆయన ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

జమ్మూ కాశ్మీర్ గవర్నర్‌గా ఆగస్టు 23, 2018 నుండి అక్టోబర్ 30, 2019 వరకు పనిచేసిన మాలిక్, రెండు ఫైళ్లను క్లియర్ చేయడానికి తనకు రూ. 300 కోట్ల లంచం ఆఫర్ చేశారని గతంలో ఆరోపించారు, ఇందులో కిరు విద్యుత్ ప్రాజెక్టుకు చెందినది కూడా ఉంది. ఈ కేసులో ఫిబ్రవరి 2024లో సీబీఐ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ లోని మాలిక్ నివాసాలతో పాటు 30కి పైగా ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది.

మాలిక్‌తో పాటు ఆయన సహచరులు, కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు అమలు చేస్తున్న చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్(CVPPPL)తో సంబంధం ఉన్న అధికారులపై కూడా దాడులు జరిగాయి. CVPPPL మాజీ చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, మాజీ అధికారులు ఎంఎస్ బాబు, ఎంకే మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్రా, వీరితో పాటు పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వంటి అనేక మంది వ్యక్తులు సీబీఐ రాడార్‌లోకి వచ్చారు.

Read Also: India On Turkey: పాకిస్తాన్‌కి టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత్ కీలక సూచనలు..

సీబీఐ చెబుతున్న దాని ప్రకారం, CVPPPL బోర్డు 47వ సమావేశంలో రివర్స్ వేలం ద్వారా ఈ -టెండరింగ్ ద్వారా ప్రాజెక్టును తిరిగి టెండర్ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, దీనిని అమలు చేయలేదు, కాంట్రాక్టును చివరకు పటేల్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌కి ఇచ్చారు. అయితే, తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఈ దాడులు తనను బెదిరించే ప్రయత్నం అని సత్యపాల్ మాలిక్ అన్నారు.

సీబీఐ చార్జిషీట్ తర్వాత, సత్యపాల్ మాలిక ఎక్స్ వేదిక ట్వీట్ చేశారు. ‘‘నేను గత మూడు నుండి నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను మరియు ఆసుపత్రిలో చేరాను. అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థల ద్వారా నియంత నా ఇంటిపై దాడి చేస్తున్నాడు. నా డ్రైవర్ మరియు నా సహాయకుడిని కూడా అనవసరంగా దాడి చేసి వేధిస్తున్నారు. నేను రైతు కొడుకుని, ఈ దాడులకు నేను భయపడను. నేను రైతులతో ఉన్నాను.’’ అని అందులో పేర్కొన్నారు. లంచం ఆఫర్‌కి సంబంధించి సత్యపాల్ మాలిక్ బహిరంగ ఆరోపణల నేపథ్యంలో 2022లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత దర్యాప్తులో భాగంగా కాంట్రాక్టు మంజూరులో అవకతవకలు జరిగాయనే ఆధారాలు బయటపడ్డాయి.

Exit mobile version