Site icon NTV Telugu

CBI Searches: మనీష్ సిసోడియా బ్యాంక్ లాకర్‌లో సీబీఐ తనిఖీలు

Cbi Searches

Cbi Searches

CBI Searches: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బ్యాంక్ లాకర్‌ను సీబీఐ అధికారులు ఇవాళ ఓపెన్‌ చేశారు. ఘజియాబాద్‌లోని పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌లో సిసోడియాకు లాకర్ ఉండగా.. దర్యాప్తుకు సంబంధించి ఆ లాకర్‌ను సీబీఐ సోదా చేసింది. డిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సిసోడియాను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇటీవల ఉపసంహరించుకున్న ఎక్సైజ్ పాలసీలో ఆరోపించిన కుంభకోణంపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి సీబీఐ అధికారులు ఆ లాకర్‌ను పరిశీలించారు. బ్యాంకుకు సిసోడియాతో పాటు ఆయన భార్య కూడా వెళ్లారు. దాదాపు రెండు వారాల క్రితం సిసోడియా ఇంట్లోనూ సీబీఐ సోదాలు చేప‌ట్టింది. తన లాకర్‌లో కూడా ఏమీ దొరకదని సోమవారమే మనీష్‌ సిసోడియా తెలిపారు. ఆగస్టు 19న తన ఇంట్లో 14 గంటలపాటు జరిపిన సోదాల్లో ఏమీ దొరకలేదు.. లాకర్‌లో కూడా ఏమీ దొరకదు.. సీబీఐకి స్వాగతం. విచారణకు నా కుటుంబం, నేనూ పూర్తిగా సహకరిస్తామని సోమవారం మనీష్ సిసోడియా హిందీలో ట్వీట్ చేశారు.

Robbery: సినీఫక్కీలో భారీ చోరీ.. తుపాకీ తలపై గురిపెట్టి.. ఎంత ఎత్తుకెళ్లారో తెలుసా?

మద్యం పాలసీ కేసులో సీబీఐ 15 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దాంట్లో సిసోడియా పేరు కూడా ఉంది. లంచాలు తీసుకుని అర్హులు కానివాళ్లకు లైసెన్సులు జారీ చేసిన‌ట్లు ఢిల్లీ ప్రభుత్వంపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. గ‌త ఏడాది నవంబ‌ర్‌లో ప్రవేశ‌పెట్టిన కొత్త పాల‌సీ వ‌ల్ల అక్రమాలు జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో ఆ కొత్త పాల‌సీని విత్‌డ్రా చేశారు. ఈ మద్యం విధానాన్ని అప్పటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అనుమతి లేకుండా గత ఏడాది నవంబరులో ప్రవేశపెట్టారని సీబీఐ ఆరోపించింది. లంచాలు తీసుకుని అర్హత లేని మద్యం వ్యాపారులకు అనుమతులు ఇచ్చారని ఆరోపించింది. ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఎనిమిది నెలల తర్వాత ఈ విధానాన్ని ఉపసంహరించుకుందని తెలిపింది.

సీబీఐ దాడిలో నా నివాసంలో ఏమీ దొరకనట్లే ఈరోజు తన బ్యాంక్ లాకర్‌లో ఏమీ దొరకలేదని ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అన్నారు. తనకు క్లీన్ చిట్ లభించినందుకు సంతోషంగా ఉందన్నారు. సీబీఐ అధికారులు తమతో మంచిగా వ్యవహరించారని.. తాము కూడా వారికి సహకరించామని సిసోడియా పేర్కొన్నారు. ఎట్టకేలకు నిజం గెలిచిందని ఆయన అన్నారు.

Exit mobile version