NTV Telugu Site icon

Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, పదవుల్లో ఉండొచ్చా?.. సుప్రీం కీలక ఆదేశాలు..

Supremecourt

Supremecourt

Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులుగా కొనసాగే అంశంపై కేంద్రం, ఎన్నికల సంఘం కౌంటర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్ నేరాలకు పాల్పడిన ఎంపీలు ఎమ్మెల్యేలను జీవితాంతం అనర్హత వేటు వేయాలని కోరుతూ వేసిన పిల్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. దోషులుగా తేలిన రాజకీయ నాయకులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత 6 సంవత్సరాలు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించే ‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టం’’లోని నిబంధనలను పిటిషనర్ సవాల్ చేశారు. సుప్రీంకోర్టుకు అమికస్ క్యూరీ తన రిపోర్టుని అందజేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ దీపాంకర దత్త, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన దేశవ్యాప్తంగా 5000 క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని అమికస్ క్యూరీ అత్యున్నత న్యాయస్థానానికి తెలిపారు.

Read Also: Brahma Anandam trailer: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘బ్రహ్మా ఆనందం’ ట్రైల‌ర్ విడుద‌ల‌.. ఫిబ్రవరి 14న మూవీ గ్రాండ్ రిలీజ్‌

2017లో వేర్వేరు రాష్ట్రాల్లో ప్రజాప్రతినిధుల కోసం 12 ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని, ప్రజా ప్రతినిధుల కేసులను త్వరగా పరిష్కరించడాన్ని పర్యవేక్షించడానికి అనేక ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది, అయినప్పటికీ పరిస్థితి దారుణంగానే ఉందని కోర్టుకు మిత్రుడిగా వ్యవహరించే అమికస్ క్యూరీ వెల్లడించారు. 42% సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై పెండింగ్ కేసులు ఉండడం సిగ్గుచేటని, 30 సంవత్సరాలుగా కేసులు పెండింగ్‌‌లో ఉన్నట్లు చెప్పారు. ప్రత్యేక కోర్టులు తరచుగా ప్రజాప్రతినిధుల వ్యవహారాలు కాకుండా ఇతర కేసులను విచారించాల్సి వస్తుందని చెప్పారు. దీంతో కేసులు వాయిదా పడుతున్నాయని, పలు సందర్భాల్లో నిందితులు హాజరుకావడం లేదని చెప్పారు.