Tenant Ownership after 12 Years: చాలా కాలంగా ఒక ఇంట్లో అద్దెకు లేదా భూమిని కౌలుకు తీసుకుంటున్నవారు 12 సంవత్సరాల తర్వాత ఆ ఆస్తికి యజమానులు అయిపోతారనే ప్రచారం తరచూ వినిపిస్తుంది. “12 ఏళ్లు ఉంటే ఇల్లు మీదే అయిపోతుంది” అనే మాట చాలా మందిలో ఉంది. అయితే, నిజంగా చట్టం అలా చెబుతుందా? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
అద్దెదారు యజమాని అవుతారా?
సాధారణంగా ఒక అద్దెదారు కేవలం చాలా సంవత్సరాలు అక్కడ నివసించాడనే కారణంతో ఆ ఇంటి లేదా భూమి యజమాని కాలేడు. అద్దె ఒప్పందం ద్వారా ఆస్తిలో ఉండే హక్కు మాత్రమే ఉంటుంది. యాజమాన్య హక్కు మాత్రం ఇంటి యజమానిదే. అంటే, అద్దె చెల్లిస్తూ ఒక ఇంట్లో 12 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువకాలం ఉన్నా, ఆటోమేటిక్‌గా ఆస్తి మీద హక్కు రాదు అనిది స్పష్టం అన్నమాట..
12 ఏళ్ల నిబంధన ఏమిటి?
ఇక్కడ “అడ్వర్స్ పొజెషన్” (Adverse Possession) అనే చట్టపరమైన భావన వస్తుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ఒక వ్యక్తి చాలా సంవత్సరాలు నిరంతరంగా, బహిరంగంగా, యజమాని అభ్యంతరం లేకుండా ఆస్తిని తన ఆధీనంలో ఉంచుకుంటే, యాజమాన్యంపై కోర్టులో హక్కు కోరే అవకాశం ఉంటుంది. ప్రైవేట్ ఆస్తుల విషయంలో సాధారణంగా 12 సంవత్సరాల కాలపరిమితి ప్రస్తావనలోకి వస్తుంది.
ఎలాంటి పరిస్థితుల్లో ఇది వర్తిస్తుంది?
అసలు యజమాని చాలా సంవత్సరాలు ఆస్తిపై హక్కు వినియోగించకపోవడం.. ఆస్తిని వేరొకరు నిరంతరంగా తమ ఆధీనంలో ఉంచుకోవడం.. ఆ ఆక్రమణ బహిరంగంగా ఉండడం.. యజమాని దీనికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకపోవడం.. ఇలాంటి సందర్భాల్లో మాత్రమే కోర్టులో అడ్వర్స్ పొజెషన్ ఆధారంగా కేసు వేయవచ్చు.
అద్దెదారులకు ఇది వర్తిస్తుందా?
నిపుణుల ప్రకారం, అద్దెదారుల విషయంలో ఇది అంత సులభం కాదు. ఎందుకంటే వారు మొదట ఆస్తిలోకి ప్రవేశించింది యజమాని అనుమతితోనే. కాబట్టి అద్దెదారు ఉన్నంత మాత్రాన అడ్వర్స్ పొజెషన్ క్లెయిమ్ చేయడం కష్టం. అద్దె సంబంధం ముగిసిన తర్వాత, యజమాని హక్కును బహిరంగంగా తిరస్కరిస్తూ చాలా కాలం కొనసాగితేనే కొన్ని ప్రత్యేక కేసుల్లో పరిశీలనకు వస్తుంది.
చట్టపరంగా జాగ్రత్తలు అవసరం
ఈ అంశం ప్రతి కేసులో ఒకేలా ఉండదు. పత్రాలు, ఒప్పందాలు, అద్దె చెల్లింపుల రికార్డులు, యజమాని చర్యలు వంటి అనేక అంశాలపై నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇలాంటి విషయాల్లో న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మొత్తంగా కేవలం 12 సంవత్సరాలు అద్దెకు ఉన్నారని ఎవ్వరూ యజమాని అయిపోరు. ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అడ్వర్స్ పొజెషన్ చట్టం వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి “12 ఏళ్లు ఉంటే ఇల్లు మీదే” అనే ప్రచారం పూర్తిగా నిజం కాదు.
