NTV Telugu Site icon

Kerala BJP: “మతం పేరుతో ప్రచారం”.. కేరళ సీఎంపై ఈసీకి బీజేపీ లేఖ..

Kerala Cm

Kerala Cm

Kerala BJP: కేరళ సీఎం పినరయి విజయన్ మతం పేరుతో ప్రజల్ని రెచ్చగొడుతున్నారని కేరళ బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. సీఎం ముస్లిం వర్గాల ప్రజలను రెచ్చగొడుతున్నారని బీజేపీ ఆరోపించింది. కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ నోటిఫికేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ప్రసంగాన్ని బీజేపీ ఉదహరించింది. సీఎం ‘‘మతం పేరుతో ప్రచారం’’ చేస్తున్నారని ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన అవుతుందని, ఆయన ప్రచారాన్ని నిషేధించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.

Read Also: PM Modi: “సందేశ్‌ఖాలీ” బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రకి ప్రధాని మోడీ ఫోన్.. “శక్తి స్వరూపిణి” అంటూ..

సోమవారం సీపీఎం మలప్పురంలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీని నిర్వహించింది. దీనికి సీఎం పినరయి విజయన్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ముస్లిం వర్గాలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడటంపై బీజేపీ నేత కేకే సురేంద్రన్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టేలా, అల్లర్లను రెచ్చగొట్టేలా, రాజకీయంగా మైలేజ్ పొందేలా ముఖ్యమంత్రి ప్రసంగం ఉందని లేఖలో ఆరోపించారు. ముఖ్యంగా రంజాన్ సందర్భంగా ముస్లిం సమాజంలో భయాందోళనలు విద్వేషాలు నింపాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేశారని ఆయన ఆరోపించారు.

ముస్లింలనున పౌరులుగా పరిగణించడం లేదని, ముస్లింలు ఇకపై పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోలేరని, వారి పౌర హక్కులు నిరాకరించబడుతున్నాని పినరయి విజయన్ కామెంట్స్ చేశారని సురేంద్రన్ ఆరోపించారు. ఈ చట్టం ప్రకారం ఏ ముస్లిం కూడా భారత్‌లో జీవించలేడని సీఎం చెప్పినట్లు సురేంద్రన్ లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రసంగంతో కేరళ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని, కేరళ సీఏఏ, ఎన్పీఆర్ వంటి చట్టాలను అమలు చేయదని చెబుతూ.. తద్వారా హిందూ-ముస్లిం విభజన సృష్టించి, వారి మధ్య ద్వేషాన్ని రేకెత్తిస్తున్నారని లేఖలో చెప్పారు. ముఖ్యమంత్రి ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.