NTV Telugu Site icon

Delhi: పేద విద్యార్థులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎం-విద్యాలక్ష్మీ పథకానికి ఆమోదం

Pmmodi

Pmmodi

పేద విద్యార్థుల ఉన్నత విద్య కోసం మోడీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం- విద్యాలక్ష్మీ పథకంతో పాటు పలు అంశాలకు ఆమోదం తెలిపింది. పేద విద్యార్థులు ఉన్నత విద్య కోసం సులభంగా రుణాలు పొందేందుకు విద్యాలక్ష్మీ పథకానికి కేబినేట్ ఆమోదముద్ర వేసింది. డబ్బు లేని కారణంగా ప్రతిభావంతులైన విద్యార్థులు చదువుకు దూరం కావద్దనే పీఎం- విద్యాలక్ష్మీ పథకం ఉద్దేశం. ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు పీఎం-విద్యాలక్ష్మీ ద్వారా ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. ఇక సులభంగా రుణాలు పొందుకోవచ్చు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Secunderabad: చిట్టీల పేరుతో భారీ మోసం.. రూ.20కోట్లతో ఉడాయించిన దంపతులు

ప్రముఖ విద్యా నాణ్యత కలిగిన 860 ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రభుత్వం రుణ సౌకర్యం కల్పించనుంది. రూ. ఏడున్నర లక్షల వరకు రుణ సౌకర్యం అందించనుంది. ఈ పథకం ద్వారా 75 శాతం క్రెడిట్ గ్యారెంటీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. పీఎం-విద్యాలక్ష్మీ ద్వారా ఏటా 22 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి పొందనున్నారు. అలాగే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు రూ. 10,700 కోట్ల వర్కింగ్ క్యాపిటల్‌ కేటాయింపునకు ఆమోదం తెలిపింది. ఎఫ్‌సీఐ ఆపరేషన్ సామర్థ్యం పెంచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. 2004-14తో పోల్చితే 2014-24 మధ్య నాలుగు రెట్లు అధికంగా రైతులకు ఆహార సబ్సిడీ అందిందని అశ్వినీ వైష్ణవ్ అన్నారు.