దేశంలో ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ జరగనుంది. మొత్తం 3 లోక్‌సభ, 7శాసనసభ స్థానాలకు ఇటీవల ఉపఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో పాటు మరికొందరి అభ్యర్థుల భవితవ్యం నేడు తేలిపోనుంది. దిల్లీతో పాటు మొత్తం 5 రాష్ట్రాల్లో ఈ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను ఆ తర్వాత లెక్కించనున్నారు.
ఏపీలోని ఆత్మకూరు, త్రిపురలోని అగర్తల, జుబరాజ్‌నగర్, సుర్మా, బర్దోవాలి (పట్టణ) నియోజకవర్గాలకూ; ఝార్ఖండ్‌లోని మందార్, దిల్లీలోని రాజిందర్‌నగర్ శాసనసభ స్థానాలకూ ఇటీవల ఉపఎన్నికలు జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్, ఆజాంగఢ్ ఎంపీ స్థానాలతో పాటు పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు నిర్వహించారు. త్రిపుర ముఖ్యమంత్రి పదవి నుంచి బిప్లవ్ దేవ్ తప్పుకోవడంతో.. ఎంపీగా ఉన్న మాణిక్ సాహా ఆ బాధ్యతలను చేపట్టిన సంగతి తెలిసిందే. బర్దోవాలి(పట్టణ) నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన భవితవ్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.