Site icon NTV Telugu

Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ పేలుడు వెనక “వ్యాపార శతృత్వం”.. హోం మంత్రి ఏం చెప్పారంటే..

Rameshwaram Cafe Blast

Rameshwaram Cafe Blast

Rameshwaram Cafe Blast: బెంగళూర్ నగరంలో రామేశ్వరం కేఫ్ పేలుడు దేశంలో సంచలనంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. నిందితుడు టిఫిన్ చేసేందుకు వచ్చాడనే ముసుగులో బాంబు ఉన్న బ్యాగ్‌ని అక్కడే వదిలేసి వెళ్లాడు. టైమర్ సహాయంతో బాంబు పేల్చినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ కేసులో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ బాంబును వాడినట్లు తేలింది. ఈ కేసును బెంగళూర్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.

వ్యాపార పోటీ-శతృత్వం, త్వరలో జరగనున్న ఎన్నికలు, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని, పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురిచేయాలని ఉద్దేశంతో పేలుడు జరిగిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని కర్ణాటక హోం శాఖ మంత్రి పరమేశ్వర అన్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉండటంతో, పెట్టుబడిదారులు ఇక్కడికి వస్తున్నారని, వారు పెట్టుబడులు పెట్టకుండా భయభ్రాంతులకు గురిచేయడానికి లేదా కొన్ని ఇతర తెలియని కారణాలు కూడా ఉండొచ్చని అన్నారు. వ్యాపార ప్రత్యర్థులు అసూయతో కూడా చేసి ఉండొచ్చనే కోణంలో కూడా విచారణ జరుగుతోందని చెప్పారు. రామేశ్వరం కేఫ్‌కి 11 యూనిట్లు ఉన్నాయని, దాని యజమానులు 12వ బ్రాంచ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారని, దీనికి అడ్వాన్స్ డిపాజిట్ కూడా చెల్లించారని చెప్పారు.

Read Also: Temperatures: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన ఎండ తీవ్రత.. మార్చి ప్రారంభంలోనే మండిపోతున్న భానుడు

టోపి, ముసుగు ధరించి వ్యక్తి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. సీసీటీవీలో అతడి విజువల్స్ కనిపించాయి. అయితే, నిందితుడి జాడ ఇప్పటి వరకు తెలియలేదు. కేసును ఛేదించడానికి 8 టీములు పనిచేస్తున్నాయి. వీరితో పాటు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కూడా విచారణ జరుపుతున్నాయి. ఈ కేసును పరిష్కరిస్తామని, ఎంత కష్టమైనా మా డిపార్ట్‌మెంట్ ఛేదిస్తుందని హోమంత్రి పరమేశ్వర చెప్పారు.

బాంబు పరిమాణం తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పిందని, బాంబు నిలువుగా కాకుండా అడ్డంగా పేలి ఉంటే ప్రాణనష్టం జరిగేదని, తాను ఆ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు బోల్టులు, మేకులు పైకి వెళ్లిన ఆనవాళ్లు ఉన్నాయని పరమేశ్వర వివరించారు. ప్రజలు ఊహాజనిత వార్తల్ని నమ్మెద్దని, ముఖ్యమంత్రి, పోలీసుల సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు.

Exit mobile version