NTV Telugu Site icon

Election Commissioners: కొత్త ఎలక్షన్ కమిషనర్లుగా సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌

Ec

Ec

Election Commissioners: భారత ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ఖాళీగా ఉన్న రెండు ఎన్నికల కమిషనర్ల స్థానాలకు బ్యూరోక్రాట్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, జ్ఞానేష్ కుమార్‌లను ఎంపిక చేసినట్లు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రస్తుతం ప్యానెల్‌లో కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈయనకు సాయం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇరువురిని ఎంపిక చేసింది. ఈ సమావేశానికి పీఎం మోడీతో పాటు ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరయ్యారు.

Read Also: CAA: సీఏఏ మతపర వివక్ష చూపిస్తోంది.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ అసహనం..

అయితే, సెలక్షన్ కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తిని తప్పించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిని తీసుకోవడంపై అధిర్ రంజన్ కేంద్రంపై మండిపడ్డారు. ఈ కమిటీలో భారత ప్రధాని న్యాయమూర్తికి చోటు ఉండాల్సిందని, గతేడాది తీసుకువచ్చిన కొత్త చట్టం దీన్ని కుదించిందని, ప్యానెల్‌లో ప్రభుత్వానికి మెజారిటీ ఉందని, వారు కోరుకుంటున్నది జరిగిందని ఆయన అన్నారు.

నిన్న రాత్రి తన పరిశీలన కోసం 212 పేర్లను ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకుంటే, ఈ రోజు మధ్యాహ్నం మీటింగ్ జరిగిందని, ఎవరైనా ఒకే రోజులో ఇంత మంది పేర్లను ఎలా పరిశీలిస్తారు..? అని ఆయన ప్రశ్నించారు. సమావేశానికి ముందు తనకు 6 పేర్లను షార్ట్ లిస్టును అందించారని, మెజారిటీ వారి వద్ద ఉంది, కాబట్టి వారికి కావాల్సిన అభ్యర్థులను కమిషనర్లుగా నియమించుకున్నారని అధిర్ రంజన్ చౌదరి చెప్పారు. ఇది ఏకపక్షమని తాను అనడం లేదు కానీ, అనుసరిస్తున్న విధానంలో లోపాలు ఉన్నాయని అన్నారు.