దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయో, ఎక్కువ మంది ఇష్టపడే ఆహారం బిర్యానీ. ఎన్ని బిర్యానీ రెస్టారెంట్లు వచ్చినా డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. నోరూరించే బిర్యానీ తక్కువ ధరకు అందిస్తే ఇంకెందుకు ఊరుకుంటారు చెప్పండి. అమాంతం లాగించేస్తారు. సాధారణంగా బిర్యానీ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా తక్కువ ఆఫర్లు పెడుతుంటారు. ఇలానే తమిళనాడులోని మధురైకి చెందిన ఓ వ్యాపారి బిర్యానీ సెంటర్‌ను ప్రారంభించారు. ప్రారంభం రోజున వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఐదు పైసలకే బిర్యానీ అని ప్రకటించాడు. పాతకాలం నాటి పైసలు, పైగా ఇప్పుడు అవి చెల్లుబాటుకావు. ఎవరు వస్తారులే అనుకున్నాడు.
Read: రివ్యూ: సార్పట్ట పరంపర (తమిళ డబ్బింగ్)
కానీ అనూహ్యంగా అనుకున్నదాని కంటే అధికంగా 300 మంది 5 పైసల నాణేలతో సెంటర్ ముందు క్యూ కట్టారు. మాస్క్ ధరించకుండా, బౌతికదూరం పాటించకుండా ఒకరినొకరు తోసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ రగడ జరిగింది. కంట్రోల్ చేయలేక బిర్యానీ సెంటర్ సిబ్బంది షట్టర్ మూసేశారు. పెద్దసంఖ్యలో అక్కడ జనాలు గుమిగూడటంతో పోలీసులు రంగప్రవేశం చేసి గుంపును చెదరగొట్టారు. ఐదు పైసలకే బిర్యానీ ప్రకటించి సేల్స్ పెంచుకోవాలని చూసిన బిర్యానీ షాపు యాజమాన్యం ఆఫర్ అమ్మకుండానే మూతవేయాల్సి వచ్చింది.