Site icon NTV Telugu

Mayawati: ఢిల్లీలో మాయావతికి ప్రత్యేక బంగ్లా కేటాయింపు.. పొత్తుల పుకార్లపై క్లారిటీ

Mayawati

Mayawati

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ వ్యూహాలు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతికి దేశ రాజధాని ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేంద్రం కేటాయించింది. టైప్-8 బంగ్లాలను కేవలం కేంద్రమంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులకు కేటాయిస్తారు. అలాంటి టైప్-8 బంగ్లాను తాజాగా మాయావతికి కేటాయించడంపై పొలిటికల్‌గా రకరకాలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వదంతులు వ్యాప్తి చెందడంతో మాయావతి రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు.

భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలో టైప్-8 బంగ్లాను కేటాయించారని.. ఇందులో ఎలాంటి వ్యూహాలు లేవని మాయావతి స్పష్టం చేశారు. తప్పుడు పుకార్లను కార్యకర్తలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరిగే ఎన్నికల వ్యూహాన్ని తెలియజేశారు. ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమిలో చేరబోతున్నారంటూ వస్తున్న వార్తలను కార్యకర్తలెవరూ నమ్మొద్దని సూచించారు. అవి తప్పుదారి పట్టించేవి.. నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. తప్పుడు వార్తలను పక్కకు పెట్టి ముందుకు సాగిపోవాలని విజ్ఞప్తి చేశారు. 2007లో మాదిరిగానే రాష్ట్రంలో పూర్తి మెజారిటీతో కూడిన బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం అని చెప్పారు.

కేవలం కార్యకర్తల దృష్టి మరల్చడానికే ఇలాంటి పుకార్లు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్నారన్నారు. బీఎస్పీ ఎప్పుడూ తన సొంత బలాన్నినమ్ముకుంటుందని.. ఎవరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. కార్యకర్తలంతా ఏనుగులా నడవాలని విజ్ఞప్తి చేశారు. దయచేసి బంగ్లాకు సంబంధించి ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రత్యర్థులకు మాయావతి సూచించారు.

Exit mobile version