BS Yediyurappa: కర్ణాటక బీజేపీ నేత, మాజీ సీఎం యడియూరప్ప కేసు సంచలనంగా మారింది. 17 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, బాలిక తల్లి ఫిర్యాదు చేయడంతో ఆయనపై పోక్సో, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసును ప్రస్తుతం సీఐడీ విభాగం విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణకు హాజరుకావాలని యడియూరప్పకి బుధవారం నోటీసులు జారీ చేసింది. దీనిపై కొంత సమయం కావాలని ఆయన సీఐడీని కోరారు. తాను ఢిల్లీలో ఉన్నందున జూన్ 17న విచారణకు హాజరవుతానని సీఐడీ నోటీసుకు యడ్యూరప్ప బదులిచ్చారు. ఇప్పటికే యడియూరప్ప మూడుసార్లు విచారణకు హాజరుకాగా, నాలుగోసారి నోటీసులు వచ్చాయి.
ఇదిలా ఉంటే ఈ కేసులో అవసరమైతే యడియూరప్పని అరెస్ట్ చేస్తామని, దీనిపై రాష్ట్ర నేర పరిశోధన విభాగం (సీఐడీ) నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర గురువారం అన్నారు. మరోవైపు అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు యడియూరప్ప కర్ణాటక హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని కోర్టు రేపు విచారించనుంది.
Read Also: ఉదయం లేవగానే ఇవి చూస్తున్నారా..?
ఈ కేసు గురించి కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండూరావు మాట్లాడుతూ.. ‘‘చట్టం అందరికీ సమానమే.. ఆ ఘటనలో ఏం జరిగినా పోలీసులు చట్ట ప్రకారం నడుచుకుంటారు. అతడు దోషి అని నేను అనను కానీ, చట్టానికి అందరూ సమానం. చట్టం కంటే ఎవరూ పెద్దవారు కాదు.’’ అని అన్నారు.
బాలిక తల్లి చీటింగ్ కేసులో సాయం కోరేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో యడియూరప్పను కలిసేందుకు వెళ్లగా, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆమె మార్చి 14న సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోక్సో చట్టం మరియు IPC సెక్షన్ 354A (లైంగిక వేధింపులు) కింద అభియోగాలు మోపారు. అయితే, ఈ ఆరోపణల్ని నిరాధారమైనవిగా యడియూరప్ప తిరస్కరించారు. బీజేపీ నేత అయిన యడియూరప్ప 2008-2011 మధ్య, 2018లో కొంత కాలం, 2019-2021 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.