NTV Telugu Site icon

Yediyurappa: పోక్స్ కేసులో హైకోర్టుకు యాడియూరప్ప.. ఏం విజ్ఞప్తి చేశారంటే..!

Yue

Yue

పోక్స్ కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు యాడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును రద్దు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ మేరకు హైకోర్టులో యాడియూరప్ప పిటిషన్ దాఖలు చేశారు.

ఇదిలా ఉంటే పోక్సో కేసులకు సంబంధించిన ప్రత్యేక కోర్టులో యాడియూరప్పపై పోలీసులు గురువారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఏడాది మార్చిలో సదాశివనగర్ పోలీసులు మాజీ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ మోహన్ తదుపరి విచారణ కోసం నేర పరిశోధన విభాగానికి (సీఐడీ) బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఫిబ్రవరిలో డాలర్స్ కాలనీలోని బీజేపీ నాయకుడి ఇంట్లో జరిగిన సమావేశంలో తన కుమార్తెను వేధించాడని 17 ఏళ్ల బాలిక తల్లి ఫిర్యాదు మేరకు యాడియూరప్పపై కేసు నమోదు చేశారు. ఈ ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి ఖండించారు. తనకు కుట్రలకు పాల్పడే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని యాడియూరప్ప వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన 54 ఏళ్ల మహిళ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో గత నెలలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి జూన్ 17న యాడియూరప్పను సీఐడీ మూడు గంటల పాటు ప్రశ్నించింది. ఈ కేసులో మాజీ సీఎంను అరెస్టు చేయకుండా సీఐడీని నిలుపుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు గతంలో ఉత్తర్వులు జారీ చేసింది.