NTV Telugu Site icon

Bihar: బీహార్‌లో కుంగిన వంతెన..20 రోజల్లో ఆరో ఘటన..

Bihar

Bihar

Bihar: బీహార్‌లో వరసగా వంతెనలను ప్రమాదానికి గురవుతున్నాయి. రోజుల వ్యవధిలో వంతెనలు కూలిపోవడమో, కుంగిపోవడం జరుగుతోంది. తాజాగా మరో వంతెన ఆదివారం కుంగిపోయింది. 20 రోజుల్లో ఇది ఆరో ఘటన. భారీ వర్షాల తర్వాత బండ్ నది నీటిమట్ట పెరగడంతో ఠాకూర్‌గంజ్ బ్లాక్‌లోని వంతెన ఈ రోజు కొన్ని అడుగుల మేర కుంగిపోయింది. దీంతో వంతెన ఉపరితలంపై పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో వంతెన ప్రమాదకరంగా మారింది. పఠారియా పంచాయతీలోని ఖోషి డాంగి గ్రామంలో ఉన్న వంతెనను ఠాకూర్‌గంజ్‌లోని అప్పటి ఎంపీ ఎండీ తస్లీముద్దీన్ ఎంపీ నిధుల నుంచి 2007-2008లో నిర్మించారు. కానీ వంతెన నీటి ఒత్తిడిని తట్టుకోలేకపోయినట్లు తెలుస్తోంది. మూడు నాలుగు పంచాయతీలను కలుపుతున్న ఈ వంతెన కూలిపోతే 60 వేల మంది ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది.

Read Also: Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు మధ్య ఆసక్తికర చర్చ

నిన్న మధుబని ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. బీహార్ ప్రభుత్వంలోని రూరల్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వంతెన కుప్పకూలింది. దీనికి ముందు అరారియా, సివాన్, తూర్పు చంపారన్ మరియు కిషన్‌గంజ్ ప్రాంతాల్లో వంతెనలు కూలాయి.

ఇటీవల బీహార్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వంతెనలు కూలిపోతున్నాయి. దీనిపై ప్రతిపక్షాలు ముఖ్యంగా ఆర్జేడీ పార్టీ అధికార జేడీయూ-బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర రాష్ట్రాలు బీహార్ ప్రజలకు ‘మంగళ్‌రాజ్’ అందించారని వంతెనల కూలిన ఘటనలపై ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ విమర్శించారు. అయితే, ఈ బ్రిడ్జిలు కూలిపోతున్న ఘటనపై ఏదైనా కుట్ర ఉందా..? అనే అనుమానాన్ని కేంద్రమంత్రి జీతన్ రామ్ మాంఝీ వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచే ఎందుకు కూలడం ప్రారంభమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం పరువు తీసేందుకు ఏదైనా కుట్ర చేస్తున్నారా.? అని అన్నారు.