‘అనుకున్నదొకటి, అయినదొకటి, బోల్తా కొట్టిందిలే బుల్‌బుల్ పిట్ట’.. ఇక్కడ ప్రస్తుతానికి పిట్ట స్థానంలో ‘నథింగ్’ అని పెట్టుకోవాలి. ఎందుకంటే, ప్రస్తుతం ఆ మొబైల్ కంపెనీ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిణామాలు అలాంటివి మరి! కొత్తగా వస్తోన్న ఫోన్ కాబట్టి, ప్రాంక్‌తో కాస్త మార్కెటింగ్ పెంచుకుందామని ఒక ప్లాన్ వేసుకుంటే.. అది బెడిసికొట్టి దక్షిణ భారతీయుల ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. ఏకంగా ‘బాయ్‌కాట్ నథింగ్’ అనే డేంజర్ బెల్స్ మోగేదాకా పరిస్థితిని తెచ్చుకుంది. అంతలా ఆ సంస్థ ఏం చేసింది? పదండి.. ఆ వివరాల్లోకి వెళ్దాం.
సాధారణంగా ఏదైనా ఒక కొత్త మొబైల్ ఫోన్ మార్కెట్‌లోకి వస్తోందంటే.. విడుదలకు కొన్ని రోజుల ముందే యూట్యూబర్స్‌తో ‘అన్‌బాక్స్’ వీడియోలు చేయిస్తుంటారు. తమ ప్రొడక్ట్‌ని జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకే ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ! లండన్-బేస్డ్ స్టార్టప్ కంపెనీ నథింగ్ కూడా తన ‘నథింగ్ ఫోన్ 1’ కోసం అదే స్ట్రాటజీని అనుసరించింది. కానీ, రొటీన్‌కి భిన్నంగా కొత్తగా ట్రై చేయాలని ప్లాన్ వేసింది. ఈ ప్లాన్‌లో భాగంగానే ‘ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు’ యూట్యూబర్‌తో ఓ ప్రాంక్ వీడియో ప్లాన్ చేసింది. అతడు బాక్స్ ఓపెన్ చేయగానే.. అందులో మొబైల్ ఫోన్‌కి బదులు, ‘‘ఈ ఫోన్ కేవలం ఉత్తరాది జనాల కోసం మాత్రమే, దక్షిణాది ప్రజల కోసం కాదు’’ అనే లెటర్ ఉంది. ఆ యూట్యూబర్ ఆ లెటర్ తీసి అలా చదవడమే ఆలస్యం.. కోపాద్రిక్తురాలైన సౌత్ ఇండియన్స్, వెంటనే ‘డియర్ నథింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేయడం మొదలుపెట్టేశారు.
అదొక ఫేక్ లెటర్ అని, అదొక ప్రాంక్‌లో భాగమని పూర్తిగా రివీల్ చేసేలోపే.. సౌత్ ఇండియన్ తీవ్ర ఆగ్రహావేశానికి గురై, తమ కోపాన్ని ఆ సంస్థపై ప్రదర్శించడం మొదలుపెట్టారు. ‘బాయ్‌కాట్ నథింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా ట్రెండ్ అయ్యిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ‘‘ఇదెక్కడి పక్షపాతం, మ్యానుఫ్యాక్చర్ చేస్తోందే తమిళనాడులో, అలాంటిది సౌత్ ఇండియాలో కాకుండా, నార్త్ ఇండియన్స్‌కి మాత్రమే ఫోన్ అందుబాటులోకి తీసుకురాడమేంటి’’ అంటూ ఏకిపారేస్తున్నారు. అయితే.. ఇంకా చాలామందికి ఆ లెటర్ ఫేక్ అని తెలియదు. అందుకే, ఆ రెండు హ్యాష్‌ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇదీ.. అసలు సంగతి!
