NTV Telugu Site icon

Mumbai: ఫెర్రీని ఢీకొట్టిన స్పీడ్‌బోటు.. ఇద్దరు మృతి.. పలువురు గల్లంతు

Boataccidentmumbai

Boataccidentmumbai

ముంబై తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోటులో విహరిస్తూ ఆహ్లాదకరంగా గడుపుతున్న పర్యాటకులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఓ స్పీడు‌బోటు అమాంతంగా వచ్చి ఢీకొట్టడంతో ఫెర్రీ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆనందం కాస్త విషాదంగా మారడంతో టూరిస్టులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన నేవీ గార్డ్సు, పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. మొత్తం బోటులో 80 మంది పర్యాటకులు పర్యటిస్తున్నారు. పలువురిని ప్రయాణికులను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు.

ముంబైలోని ‘గేట్‌ వే ఆఫ్‌ ఇండియా’ నుంచి ఎలిఫెంటా గుహలకు ఫెర్రీ బోటు ప్రయాణికులతో వెళ్తోంది. అయితే అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ స్పీడ్‌బోటు ఢీకొట్టింది. దీంతో ఫెర్రీ మునగడం ప్రారంభించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రయాణికులు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మరికొందరు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయారు. మరికొందరు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పోర్టు అధికారులు, కోస్ట్‌గార్డ్‌, మత్స్యకారుల సహాయంతో వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో ఫెర్రీలో దాదాపు సిబ్బందితో పాటు 85 మంది ప్రయాణికులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే స్పీడ్‌బోటు వేగంగా ఢీకొట్టిన దృశ్యాలు.. మొబైల్‌లో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియలో వైరల్అవుతున్నాయి.

ఇదిలా ఉంటే ఫెర్రీ బోల్తా పడే సమయంలో లైఫ్ జాకెట్లు ధరించి ఉన్నారు. అయితే కొందరు ప్రయాణికులు ప్రాణభయంతో బెంబేలెత్తిపోయినట్లుగా కనిపిస్తోంది. స్పీడ్‌బోటు ఢీకొట్టగానే సెకన్లలోనే ఫెర్రీ మునిగిపోయింది. ఒక వైపు ఒరిగిపోయింది. ఈ గందరగోళంలో కొందరు మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావల్సి ఉంది.