Site icon NTV Telugu

Haryana: హర్యానా కొత్త సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..

Bjp

Bjp

Haryana: హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం చేశారు. ఛండీగఢ్‌లో గవర్నర్ బండారు దత్రాత్రేయ సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాజీ సీఎం మనోహర్ లాల్ కట్టర్ కూడా ఉన్నారు. బీజేపీ-జేజేపీ మధ్య ఎంపీ సీట్ల షేరింగ్‌పై విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో ముఖ్యమంత్రిని మారుస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. లోక్‌సభ ఎన్నికలలో సీట్ల పంపకం చర్చలు విఫలమైన కారణంగా అధికార బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైన నేపథ్యంలో ఖట్టర్, ఆయన మంత్రివర్గం వైదొలిగింది. పాత మంత్రి వర్గం మొత్తం రాజీనామా చేసింది.

Read Also: Russia: కుప్పకూలిన రష్యా మిలిటరీ కార్గో విమానం.. 15 మంది దుర్మరణం..

90 మంది శానససభ్యులు ఉన్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ఆరుగురు ఇండిపెండెంట్లు, హర్యానా లోఖిత్ పార్టీ(హెచ్ఎల్‌పీ)కి చెందిన ఒకరితో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలుస్తోంది. దీంతో బీజేపీ మెజారిటీ మార్క్ 46ని చేరుకుంటుంది. మరోవైపు జేజేపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కూడా బీజేపీకి మద్దతు ప్రకటిస్తున్నట్లు సమాచారం.

హర్యానాలో 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ-జేజేపీ కూటమి అధికారంలోకి వచ్చాయి. అయితే, ఇటీవల లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సీట్ల షేరింగ్‌పై విభేదాలు తలెత్తాయి. మొత్తం 10 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేయాలని భావిస్తోంది. అయితే జేజేపీ మాత్రం తమకు 2 స్థానాలు కోటాయించాలని కోరగా.. బీజేపీ ఒక స్థానం ఇస్తామని ప్రతిపాదించింది. 2019లో జేజేపీ ఏడు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయింది. బీజేపీ మొత్తం 10 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, ప్రస్తుతం తాము మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తామని జేజేపీ చీఫ్ దుష్యంత్ చౌతాలా భావిస్తున్నారు.

Exit mobile version