NTV Telugu Site icon

Rahul Gandhi: దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి.. లాట్రల్ ఎంట్రీపై రాహుల్ ఫైర్..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లాటరల్ ఎంట్రీ వివాదంపై కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఆ విధానంపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది దళితులు, ఓబీసీలు, ఆదివాసీలపై దాడి అని సోమవారం అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమే ఈ విధానాన్ని తీసుకువచ్చిందని బీజేపీ ఆరోపించింది. బీజేపీ రామరాజ్యాన్ని వక్రీకరించి, రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి, బహుజనుల నుంచి రిజర్వేషన్లు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆయన ట్వీట్ చేశారు.

45 మంది జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ సెక్రటరీలను లాటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్‌మెంట్ చేసేందుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో స్పెషలిస్టు(ప్రైవేట్ రంగానికి చెందిన వారితో సహా) నియామకం కోసం నోటిఫికేషన్ వెలువడింది. భారతదేశ పరిపాలన యంత్రాంగం, సామర్థ్యాన్ని, ప్రతిస్పందనను పెంచేందుకు నిపుణుల అవసరాన్ని గుర్తించడం ద్వారా ప్రధాని నరేంద్రమోడీ హయాంలో లాటరల్ ఎంట్రీ పథకాన్ని అధికారికంగా ప్రవేశపెట్టారు.

Read Also: Kolkata Doctor Case: కోల్‌కతా ఆస్పత్రిపై దాడి తృణమూల్ గుండాల పనే.. బాధితురాలి న్యాయవాది..

2018లో, జాయింట్ సెక్రటరీలు మరియు డైరెక్టర్ల వంటి సీనియర్ స్థానాలకు ఖాళీలను ప్రకటించడం ద్వారా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ ఉన్నతస్థాయి పొజిషన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగాలకు చెందిన నిపుణులను ఆహ్వానించారు. కఠినమైన ఎంపిక ప్రక్రియ ద్వారా అభ్యర్థుల అర్హతలు, అనుభవాన్ని బేరీజు వేసుకుని ఈ కీలకమైన పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు.

అయితే, ప్రధాని నరేంద్రమోడీ సాంప్రదాయక యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) ద్వారా ప్రభుత్వ ఉద్యోగుల్ని భర్తీ చేయకుండా, ఆర్ఎస్ఎస్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలను నియమిస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. పాలన నిర్మాణం, సామాజిక న్యాయం రెండింటిని దెబ్బతీసి ఈ ‘‘దేశ వ్యతిరేక చర్య’’ని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన చెప్పారు. ఈ పద్ధతి ‘‘ఐఏఎస్‌ల ప్రైవేటీకరణ’’ అని, రిజర్వేషన్లను అంతం చేసే ప్రక్రియ అని ఆరోపించారు.