Site icon NTV Telugu

BJP: ప్రధాని మోడీని ‘‘అంతం’’ చేయడమే లక్ష్యమా..? కాంగ్రెస్‌ ‘‘ఓట్ చోరీ’’పై బీజేపీ ఫైర్..

Congress

Congress

BJP: ‘‘ ఓట్ చోరీ’’పై భారీ ర్యాలీకి కాంగ్రెస్ సిద్ధమవుతోంది. అయితే, ర్యాలీ వేదిక వద్ద ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి పలువురు కార్యకర్తలు విద్వేష వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ప్రధాని మోడీని ‘‘అంతం చేయడమే’’ కాంగ్రెస్ అసలు లక్ష్యంగా ఉందని బీజేపీ ఆరోపించింది. ఢిల్లీలో ఆదివారం కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీ వేదిక వద్ద ప్రతిపక్ష పార్టీకి చెందిన కార్యకర్తలు వివాదాస్పద నినాదాలు చేసిన తర్వాత, బీజేపీ నుంచి ఈ ఆరోపణలు వచ్చాయి. “మోదీ, తేరీ కబర్ ఖుదేగీ” అనే హింసాత్మక నినాదాలు చేశారని బీజేపీ నేతలు ఆరోపించారు.

Read Also: Lionel Messi: “మెస్సీ” ఈవెంట్ ఆర్గనైజర్ అరెస్ట్.. 14 రోజుల పోలీస్ కస్టడీ..

ప్రధాని మోడీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన నినాదాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఆయన పాలన ముగిసిపోతుందని అందులో చెప్పడం కనిపిస్తోంది. ఈ వివాదంపై బీజేపీ నేత, అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘వారి ఎజెండా స్పష్టంగా ఉంది. ఇది ఎస్ఐఆర్ (SIR) గురించి కాదు. ఇది రాజ్యాంగంపై దాడి గురించి… ఎస్ఐఆర్ పేరుతో వారు ప్రధాని మోదీని అంతమొందించాలనుకుంటున్నారా? ఇటీవల రాహుల్ గాంధీ ఈసీఐని కూడా బెదిరించారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రధాని మోదీని 150కి పైగా సార్లు దూషించింది’’ అని పూనావాలా ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు.

‘‘వారు ఎన్నికల్లో ఓడిపోయారు, మరియు ఆ బాధ్యతను రాహుల్ గాంధీ తీసుకోవాలని వారు కోరుకోవడం లేదు. కొన్నిసార్లు వారు ఎన్నికల సంఘాన్ని బెదిరిస్తారు, అదే పనిని రాహుల్ గాంధీ చేశారు, ఇప్పుడు వారు ప్రధాని మోదీని చంపాలనుకుంటున్నామని బహిరంగంగా చెప్పారు… అతను కుటుంబాన్ని రాజ్యాంగం కంటే పైస్థానంలో ఉంచాలని, ప్రజాస్వామ్య సంస్థలను అణచివేయాలని, మరియు తమ కుటుంబం దేశం కంటే గొప్పదనే ఆధిపత్య మనస్తత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నారు’’ అని పూనావాలా ఆరోపించారు.

ఓట్ చోరీ, ఓటర్ల జాబితా సవరణలపై ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను కాంగ్రెస్‌తో సహా దాని మిత్రపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా తన ప్రచారాన్ని తీవ్రం చేయడానికి ఆదివారం కాంగ్రెస్ ఢిల్లీలోని రామ్ లీలా మైదాన్‌లో భారీ ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ భారీ ర్యాలీకి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, నాయకులు ఢిల్లీకి వచ్చారు.

Exit mobile version